- బంగారు తెలంగాణే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషిచేయాలి
- ఉప ముఖ్యమంత్రి రాజయ్య
- తెలంగాణ జాతిపితకుఘన నివాళి
హన్మకొండ సిటీ : ‘పెద్ద సార్ చూపిన మార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అందరం భాగస్వాములై కొత్త పల్లి జయశంకర్ ఆశించిన తెలంగాణను నిర్మిం చుకుందాం. బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగాలి.’ అని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ మూడో వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండ ఏకశిల పార్కులోని ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎంతోపాటు శాసన సభా స్పీకర్ సిరికొండ మధుసూద నాచారి, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, కలెక్టర్ జి.కిషన్ పూలమాలలు వేసి నివాళులర్పిం చారు.
అనంతరం రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ ఊపిరి పోశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ దార్శనికుడని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు నిరంతరం ఉద్యమించారన్నారు. మలిదశ ఉద్యమం ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడంలో.. హింసకు తావులేకుండా పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఆయన మార్గదర్శకంగా నిలిచారన్నారు.
ఏకశిల పార్కును జయశంకర్ సార్ స్మృతి వనంగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్తగా భూపాలపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు జయశంకర్ పేరును పెడతామని పునరుద్ఘాటించారు. జయశంకర్ వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహిస్తోందని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి తెలిపారు. ఈ రోజు ఆయన లేకపోవడం దురదృష్టకరమన్నారు. వారు కోరుకున్న తీరులో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని... ప్రజలు ఆశించిన తెలంగాణను నిర్మించుకుందామన్నారు.
వరంగల్ నగరంలోని ప్రధాన కూడలిలో జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఆరు నెలల్లో ఏర్పాటు చేయనున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. దీంతోపాటు అధ్యయన కేంద్రం, గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మర్రి యాదవరెడ్డి, లలితా యాదవ్, లింగంపల్లి కిషన్‌రావు, నాగేశ్వర్‌రావు, గుడిమల్ల రవికుమార్, కమరున్నీసా బేగం, వాసుదేవరెడ్డి, నయూమొద్దీన్, మరుపల్లి రవి పాల్గొన్నారు.
ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో...
ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యోగ జేఏసీ నాయకులు పరిటాల సుబ్బారావు, జగన్‌మోహన్‌రా వు, కోల రాజేష్‌కుమార్, రత్నవీరాచారి, హసన్, రత్నాకర్ రెడ్డి, ధరంసింగ్, శ్యాం సుందర్, రమేశ్, శ్రీనివాస్, షేక్‌హుస్సేన్, శ్యామల రమేశ్ పాల్గొన్నా రు. కాగా, జయశంకర్ విగ్రహానికి కవులు, రచయితలు అంపశయ్య నవీన్, పొట్లపల్లి శ్రీనివాస్, నాగిళ్ల రామశాస్త్రి, అశోక్‌తోపాటు పలువురు సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.