గాంధీజీ విగ్రహానికి మసి పూసి, మెడలో దేశ వ్యతిరేక నినాదాల పేపర్ల దండవేసిన దృశ్యం
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయా.? సమస్యాత్మక ప్రాంతాలే అడ్డాగా స్లీపర్ సెల్స్ కీలకంగా పని చేస్తున్నాయా.? స్వచ్ఛంద సంస్థ ముసుగులో దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయా..? అంటే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గతంలో జిల్లాలో పలుమార్లు ఉగ్రవాద కదలికలు వె లుగు చూశాయి. తాజాగా వారం వ్యవధిలో చోటు చే సుకున్న రెండు ఘటనలతో మరోమారు ఉగ్రవాద కా ర్యకలాపాలపై అనుమానాలు బలపడుతున్నాయి. నిజామాబాద్ మండలం గుండారంలో జాతిపిత గాంధీజీ విగ్రహానికి మసి పూసిన నిందితులు దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్ల దండ వేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది.
గుండారం గ్రామంలో గల గాంధీ విగ్రహానికి నల్ల రంగ పూసి ఉన్నట్లు ఆదివారం మధ్యాహ్నం గమనించిన స్థానిక యువకులు, విగ్రహం మెడలో పేపర్ల దండ ఉన్నట్లు గుర్తించారు. దీంతో విగ్రహం వద్దకు వెళ్లి పరిశీలించగా, దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్ల దండ కనిపించింది. అందులో ‘పాకిస్తాన్ జిందాబాద్.. ఇండియా డౌన్ డౌన్ డౌన్.. జీహాద్.., షాదుల్లాను విడుదల చేయాలి.. కాశ్మీర్ పాకిస్తాన్ దే..’ అంటూ తెల్ల కాగితాలపై రాసి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
తాజా ఘటనతో జిల్లాలో అసాంఘిక శక్తుల కదలికలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో విష ప్రచారం చేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. జిల్లాలో ‘ఉగ్ర’ కార్యకలాపాలను గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవలే పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కొన్ని రోజులుగా అసాంఘిక శక్తుల కార్యకలాపాలపై కన్నేసినట్లు సమాచారం.
మూడు చోట్ల స్లీపర్ సెల్స్!
ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అసాంఘిక శక్తుల కార్యకలాపాలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు పోలీసులను అప్రమత్తం చేస్తున్నాయి. అయినా ఎక్కడో ఒకచోట ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కొందరు జిల్లాలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో షెల్టర్ తీసుకుంటూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బోధన్‌లోని అత్యంత సమస్యాత్మకమైన మూడు ప్రాంతాలతో పాటు ఎడపల్లి మండలంలోని ఓ గ్రామంలో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు నిఘా వర్గాలు గతంలోనే గుర్తించాయి. అలాగే, నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని సముదాయాల్లోనూ కొందరు అనుమానిత వ్యక్తులు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు గతంలోనే పక్కా సమాచారముంది. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే రైళ్లలో వస్తున్న కొందరు అనుమానితులు రాత్రి పొద్దుపోయే వరకూ రైల్వే స్టేషన్ సమీపంలోని సముదాయాల్లో కొందరు స్థానికులతో భేటీ వేస్తున్నట్లు కూడా గతంలోనే గుర్తించారు.
ఇక, నిషేధిత సంస్థ సిమికి సంబంధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సభ్యులుగా భావిస్తున్న ముగ్గురిని పోలీసులు గత వారం కలెక్టరేట్ వద్ద అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఒకరిని విడుదల చేయాలంటూ తాజాగా గుండారంలో వెలుగు చూసిన పేపర్ల దండలో అగంతకులు డిమాండ్ చేయడం చూస్తుంటే జిల్లాలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు పోలీసులు సూత్రప్రాయంగా నిర్ధారణకు వచ్చారు. గాంధీజీ విగ్రహానికి మసి పూసి, దేశ వ్యతిరేక నినాదాలు రాసిన అగంతకులను గుర్తించే పనిలో పడ్డారు.
‘స్వచ్ఛందంగా’ విష ప్రచారం..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో అసాంఘిక శక్తలు కదలికలు ఉన్నట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. అవగాహన సదస్సులతో గుట్టు చప్పుడు కాకుండా ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్న ఘటనలు ఇటీవల పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, రెంజల్, నందిపేట, కామారెడ్డి ప్రాంతాల్లో ఇలాంటి ఈ వ్యవహారాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఎలాంటి అనుమతి లేకుండా అవగాహన సదస్సుల పేరిట ఈ విష ప్రచారం కొనసాగుతోంది. జగిత్యాల నుంచి కొందరు జిల్లాకు వచ్చి ఒక సంస్థ పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట మాలపల్లి ప్రాంతంలో ఒక నిర్మాణాన్ని చేపట్టి, స్థానికు యువతను రెచ్చగొట్టేందుకు ఓ సంస్థ నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇది గమనించిన పోలీసులు పోలీసులు వారిని అడ్డుకున్నారు. సంబంధిత యువకుల తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి, వదిలేశారు. ఇక, ఒక మహిళతో పట్టణ శివారులోని ఓ గ్రామంలో అవగాహన సదస్సు పేరిట నిషేదిత సంస్థ అందించిన పుస్తకాలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు.
నిజామాబాద్‌లో తల దాచుకుంటూ కార్యకలాపాల నిమిత్తం జగిత్యాలకు వెళ్తున్న కరుడు గట్టిన ఉగ్రవాది అజాం ఘోరిని ఏప్రిల్ 6, 2000 సంవత్సరంలో నిజామాబాద్, కరీంనగర్ పోలీసులు కలిసి మట్టుబెట్టారు. 2002లో సారంగపూర్ ఎస్టీడీ బూత్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్ హతమయ్యాడు. 1998లో బోధన్‌లోని ఓ సైకిల్ షాప్ యజమానిని అజాం ఘోరీ అనుచరులు తొమ్మిది మంది కలిసి హత్య చేశారు. వీరిలో ఏడుగురు అరెస్టు కాగా, మరో ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఈ ఇద్దరు దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల నిందితులకు సహకరించినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. తాజాగా నిజామాబాద్ రూరల్ మండలం గుండారంలో దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్లు ప్రత్యక్షమవడంతో జిల్లాలో ఉగ్ర కదలికలపై మరోమారు జోరుగా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment