ఇంజక్షన్ వికటించి రైతు మృతి
కొత్తూరు : ఇంజెక్షన్ వికటించి ఓ రైతు మృతి చెందగా అందుకు కారణమైన పీంఎంపీని గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో ఐదు గంటలపాటు నిర్బంధించారు. చివరకు పోలీసుల జోక్యంతో విడుదల చేసి ఆపై అదుపు లోకి తీసుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం... కొత్తూరు మండలం మామిడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నసురుల్లాబాద్‌కు చెందిన బోడ యాదయ్య (45) వృత్తిరీత్యా వ్యవసాయదారు. ఈయనకు భార్య నర్సమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సమీపంలో తమకున్న రెండెకరాల పొలంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు.
కొన్ని నెలల నుంచి ఆస్తమాతో బాధ పడుతున్నాడు. దీంతో అప్పుడప్పుడు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నాడు. ఇది లాఉండగా ఐదు నెలలుగా ఫరూఖ్‌నగర్ మండలం విఠ్యాలకు చెందిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ) యాదగిరి శ్రీనివాసులుగూడ, మజీద్‌మామిడిపల్లి, నసురుల్లాబాద్‌లో పర్యటిస్తూ అనారోగ్యానికి గురైన వారికి ప్రథ మ చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నసురుల్లాబాద్‌కు రాగా యాదయ్య తన వద్ద ఉన్న ఇంజక్షన్ (వాయిల్) ను ఇవ్వాల్సిందిగా పీఎంపీని కోరాడు. అది ఇచ్చిన పది నిమిషాల్లోనే మృతి చెందగా, ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు అతనిపై దాడి చేసి ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు.
అనంతరం ఎస్‌ఐ సీహెచ్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి పీఎంపీని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పీఎంపీని వివరణ కోరగా బాధితుడు అంతకుముందు అదే ఇంజక్షన్ తీసుకున్నట్లు తెలపడంతో మళ్లీ ఇచ్చానని, అంతేతప్పా తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.