తెలంగాణకు కుట్రపూరిత అన్యాయం: కేసీఆర్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీలో తెలంగాణకు కుట్రపూరిత అన్యాయం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన అవసరముందని కేసీఆర్ తెలిపారు. అన్ని ప్రాజెక్టుల ఆపరేషన్ రూల్స్ ను తయారు చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.
ప్రాజెక్టుల గేట్లు, కాలువ నీటి విడుదలను బోర్డులే నిర్వహించాలని ఆయన తెలిపారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 50 టీఎంసీలు కేటాయించాలని సీఎం తెలిపారు. నదుల పర్యవేక్షణకు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం హెలికాఫ్టర్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
పాలమూరు ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్ కు మంచి నీరు అందించే ఆలోచన ఉందన్నారు. కృష్ణా గోదావరి బోర్డులకు తక్షణం 5 కోట్ల సహాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో ఎస్ కే పండిట్, ఎమ్మెస్ అగర్వాల్ లు పాల్గొన్నారు.