అమాత్యుల సహాయకుల వివరాల సేకరణ
అప్పుడు పొన్నాల పీఏ..
ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర.. ఇప్పటికే సేకరించిన ఇంటెలిజెన్స్
వరంగల్ : అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఇంటెలిజెన్స్ భయం పట్టుకుంది. రాజకీయ పదవులు వచ్చే విషయంలో ఇంటెలిజెన్స్ నివేదికలు కీలకమవుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఈ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. కొందరు మాత్రం ఏమీ కాదులే అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మంత్రుల స్థాయి ప్రజాప్రతినిధులే ఈ విషయంలో ముందుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రుల వద్ద, వారి కార్యాలయాల్లో పని చేసిన ఉద్యోగులను, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు నియమించుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాంగ్రెస్ మంత్రుల వద్ద పని చేసిన కొందరు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కొత్త మంత్రుల వద్ద చేరారు. స్వయంగా ఆదేశాలు ఇచ్చినా ఇలా జరగడంతో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. వెంటనే మంత్రులు ఈ విషయాన్ని సరిదిద్దుకున్నారు.
జిల్లాలో విచిత్ర పరిస్థితి
జిల్లాలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన పొన్నాల లక్ష్మయ్య వద్ద వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న ఉద్యోగిని.. వరంగల్ ఎంపీగా గెలిచిన తర్వాత కడియం శ్రీహరి తన వద్ద నియమించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల విషయంలో లోక్‌సభ సభ్యుల ప్రస్తావన లేదనే విషయంతో దీనిపై ఇబ్బంది రాలేదు. రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చిన మార్పులతో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత కీలక స్థానంలో ఉన్న శ్రీహరి.. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న నాయకుడి వద్ద పని చేసిన ఉద్యోగిని కొనసాగిస్తుండడంపై టీఆర్‌ఎస్ శ్రేణుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఉప ముఖ్యమంత్రి కార్యక్రమాల విషయాలు తమకంటే కొందరు కాంగ్రెస్ నేతలకే ముందుగా తెలుస్తున్నాయని టీఆర్‌ఎస్‌లోని ద్వితీయ శ్రేణి ప్రజాప్రతిధులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు జిల్లా నేతలు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. శ్రీహరి లోక్‌సభ సభ్యుడిగానూ ఉన్నందు వల్ల సదరు సహాయకుడు ఇంకా కొనసాగుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగం వారు సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఈ విషయంలో శ్రీహరి ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇంటెలిజెన్స్ వేగం
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కొత్త రాష్ట్రం ఏర్పాటుతో తమకు పని పరంగా ఊరట లభిస్తుందని భావించారు. వాస్తవ పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉంన్నాయి. ఉద్యమ సమయంలో కంటే ఇప్పుడు పని పెరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ కార్యక్రమాలపై నివేదికల తయారీతో నిత్యం బిజీగా ఉంటున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం మిగిలిన ప్రజాప్రతినిధుల కంటే మంత్రులు, ఆ స్థాయి ప్రజాప్రతినిధుల విషయంలో ప్రతి అంశంపై నివేదికలు రూపొందిస్తోంది. జిల్లాలో మంత్రులు పాల్గొనే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలపై ఏ రోజుకారోజు సమాచారాన్ని చేరవేస్తోంది. మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న తీరు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అన్నింటి కంటే ముఖ్యంగా టీఆర్‌ఎస్ నాయకులపై మంత్రులు, వారి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై నిఘా పెడుతోంది. ఆయా గ్రామాలు, తమ పరిధిలోని పనులు, ఇతర అంశాలపై మంత్రుల వద్దకు వచ్చే వారితో మంత్రుల సిబ్బంది ఎలా ఉంటున్నారనే అంశంపై ఇంటెలిజెన్స్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ఈ అంశాలతోనే తాటికొండ రాజయ్యకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుత మంత్రుల విషయంలోనూ ఈ నివేదికలకు ప్రాధాన్యత ఉంటోంది.
గులాబీలో నిఘా గుబులు
Published Wed, Feb 25 2015 1:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement