* జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద రూ.267.86 కోట్లు మంజూరు
* 4 నగరాలకు 552 బస్సులు.. హైదరాబాద్‌కు 80 ఏసీబస్సులు
* కరీంనగర్ నగరానికి బస్సు డిపో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కిం ద కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని నాలుగు నగరాలకు 552 కొత్త బస్సులతో పాటు ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఐటీఎస్)లను మంజూరు చేసింది. వీటికి తోడు కరీంనగర్ జిల్లాకు ఓ బస్సు డిపోను సైతం కేటాయించింది. మంజూరైన బస్సుల్లో 80 అధునాతన ఏసీ బస్సులున్నాయి. రూ.267.86 కోట్ల విలువజేసే ఈ ‘బస్సు ప్రాజెక్టు’ వ్యయంలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.113.02 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.52.44 కోట్లు, టీఎస్‌ఆర్‌టీసీ రూ. 102.40 కోట్లను భరించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ ప్రాజెక్టును మంజూరు చేసిన నేపథ్యంలో ఈ మేరకు పరిపాలనాపర అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం తనను కలవడానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.
హైదరాబాద్‌కు 422 బస్సులు
రాష్ట్రానికి మంజూరైన 552 బస్సుల్లో 422 బస్సులు హైదరాబాద్‌కు మంజూరయ్యాయి. వీటిలో 80 ఏసీ బస్సులు, 342 నాన్ ఏసీ బస్సులున్నాయి. ఖమ్మంకు 30, మహబూబ్‌నగర్‌కు 30, కరీంనగర్‌కు 70బస్సులు మంజూరయ్యా యి. బస్సులతోపాటే ఐటీఎస్‌లను కేంద్రం మంజూరు చేసింది. ఐటీఎస్‌లో భాగంగా జీపీఎస్ సహాయంతో బస్సుల ఉనికిని తెలుసుకుని ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. కరీంనగర్‌లో రూ.4.95 కోట్లతో బస్సు డిపోను నిర్మించనున్నారు.
తెలంగాణకు ‘బస్సు ప్రాజెక్టు’
Published Sat, Jan 10 2015 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement
Advertisement