అక్రమార్కులకు కళ్లెం!
పాలమూరు: ఇసుక తరలింపు ఇక ఈజీ కాదు.. అక్రమంగా కొల్లగొట్టేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడంతో పాటు వాహనాన్ని జప్తు చేయనున్నారు. సీజ్‌చేసిన ఇసుకను జిల్లా కేంద్రంలోని డిపో ద్వారా అవసరమున్న వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ నిర్మాణాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అనుమతుల పేర విచ్చలవిడిగా జరిగే అక్రమ రవాణాను ఎవరు అడ్డుకోవాలన్న దానిపై సందిగ్ధం నెలకొంది.
ఇసుకాసురులపై ఏపీఎండీసీ, మైనింగ్‌శాఖల అధికారులు ఏ మాత్రం దృష్టిసారించడం లేదు. మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా వ్యవహరించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన అదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తెలివిగా నీరుగారుస్తోంది. జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)ను అనుసంధానం చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం అక్రమ రవాణాకు అధికారికంగా గేట్లేత్తేసింది. ప్రభుత్వ నిర్మాణాలు, ప్రాజెక్టులతో పాటు ప్రైవేటు నిర్మాణాలకు సైతం ఇసుక అవసరమన్న సాకుతో ఏపీఎండీసీ ద్వారా ఇసుకను తోడేందుకు అనుమతించాలని నిర్ణయించింది.
ఇసుక విక్రయాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పాలసీ అమలుకు ముందు.. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుకను రెవెన్యూ, పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం ఇసుకను ఒక చోట చేర్చి అక్కడి నుంచి అవసరమైన వారికి ఇసుకను విక్రయించేందుకు జిల్లా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. జిల్లాలో విజృంభిస్తున్న ఇసుక మాఫీయా ఈ అవకాశాన్ని వినియోగించుకుని పక్కదారి పట్టించే ప్రయత్నంలో పడ్డారు. సర్కారు కొత్త నిర్ణయంతో ఇసుక విక్రయం పక్కదారి పడుతుందని పలువురు భావిస్తున్నారు.
ప్రభుత్వ డిపో ద్వారా
ఇసుక సరఫరా: కలెక్టర్
అక్రమ రవాణా, అక్రమ తవ్వకాల్లో జప్తుచేసిన ఇసుకను జిల్లా కేంద్రంలోని డిపో ద్వారా అవసరమున్న వ్యక్తులు, సంస్థలకు, ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాలకు సరఫరా చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ టీకే శ్రీదేవి వెల్లడించారు. అన్ని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటిగా కేటాయింపు పద్ధతిలో ఒక క్యూబిక్ మీటరును రూ.750 చొప్పున విక్రయిస్తారని, పెద్దమందడి, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇసుకను మొదటగా ప్రభుత్వమే జిల్లా కేంద్రానికి సమీపంలోని నిర్మితి కేంద్రానికి తరలించనున్నట్లు తెలిపారు.
ఒక దరఖాస్తుపై 50 క్యూబిక్ మీటర్ల ఇసుక కేటాయిస్తారని, ఆ ఇసుకను తీసుకున్న తర్వాత ఇంకా అవసరమైతే మళ్లీ 50 క్యూబిక్ మీటర్లకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుదారుని అవసరాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఏడీ మైన్స్, జియాలజీ విభాగాలు ఇసుక కే0టాయింపు చేస్తాయన్నారు. కేటాయించిన ఇసుక లబ్ధిదారుడికి నిర్మిత కేంద్రం వద్ద అప్పగిస్తారని కలెక్టర్ వెల్లడించారు. అక్కడి నుంచి నిర్మాణ ప్రాంతానికి దరఖాస్తు దారుడు అతని స్వంత ఖర్చులతో రవాణా చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
అక్రమరవాణా చేస్తే..
ఇసుక అక్రమ రవాణాకు, అక్రమ వినియోగానికి తరలిస్తే అట్టి ఇసుకను, అందుకు వినియోగించిన వాహనాన్ని రెండింటిని కూడా జప్తు చేసి బహిరంగ వేలంలో విక్రయిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. అంతేకాకుండా వాహనం డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
కేటాయించిన ఇసుక రవాణాను అన్ని పనిదినాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రవాణాకు అనుమతిస్తారు. కనుక ఇసుక అవసరం ఉన్నవారు సమీప మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.