సాగునీటి రంగానికి పెద్ద పీట
అధికంగా దేవాదులకు రూ.695 కోట్లు
ఎస్సారెస్పీకి రూ.306.80 కోట్ల్లు
కంతనపల్లికి రూ.200 కోట్లు
గ్రేటర్ అథారిటీకి రూ.300 కోట్లు
నగర పరిధిలో టెక్స్‌టైల్స్ పార్కు
టూరిజం, ఐటీ రంగాలకు తగిన ప్రాధాన్యం
రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు వరాలు
జిల్లాలో సాగునీటి రంగానికి నిధుల అడ్డంకి తొలగిపోయింది. గత బడ్జెట్‌తో పోల్చితే ఈ సారి దేవాదుల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు దాదాపు రూ.1200 కోట్ల నిధులు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ (2016-17)లో సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. వీటితో పాటు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు కేటాయించారు. టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మహాత్మాగాంధీ సార్మక (ఎంజీఎం) ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చనున్నట్టు వెల్లడించారు.
సూపర్ స్పెషాలిటీగా ఎంజీఎం
పేరుకే తప్ప తీరు మారని మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రికి సూపర్ స్పెషాలిటీ హోదా కల్పిస్తామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. దీని ప్రకారం ఎంజీఎంలో ప్రస్తుతం ఉన్న వేయి పడకల సామర్థ్యాన్ని రెండు వేలకు పెంచేందుకు ఆస్కారం ఉంది. అంతేకాకుండా దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను ఆస్పత్రికి సమకూర్చనున్నారు.