
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా జరగని నిధుల విడుదల కారణంగా చతికిలపడ్డ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తిరిగి గాడినపెట్టేందుకు నీటిపారుదలశాఖ మార్గాన్వేషణ మొదలు పెట్టింది. మెజారిటీ సాగునీటి ప్రాజెక్టులను జూన్ నాటికల్లా పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా నిధుల విడుదలలో వేగం పెంచాలని సర్కారును కోరింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల బిల్లులన్నింటినీ చెల్లించడంతోపాటు అర్ధ వార్షికానికే రూ. 25 వేల కోట్ల మేర నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ పెద్దలకు
నివేదించింది.
బిల్లులు చెల్లించక నెమ్మదించిన పనులు
ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్ల కేటాయింపులు చేసినా అనుకున్న స్థాయిలో నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ప్రస్తుతం వరకు రూ. 5,046 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పాలమూరులోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టుల పనులు నెమ్మదించగా ఆదిలాబాద్‌లోని కొమురం భీం సహా ఇతర మధ్యతరహా ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పనులు డీలా పడ్డాయి. బిల్లులు ఇవ్వనిపక్షంలో పనులు నిలిపివేస్తామనే హెచ్చరికలు మరికొన్ని చోట్ల నుంచి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులపై ఇటీవలే సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్... బడ్జెట్ అవసరాలపై నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి జూన్ వరకు నెలవారీ బడ్జెట్ అవసరాల షెడ్యూల్ తయారు చేయాలని సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ఆదేశించారు. దీంతో ఆమె సూచనల మేరకు జనవరి నుంచి జూన్ వరకు నెలవారీ వ్యయం, చేయాల్సిన పనులపై నీటిపారుదలశాఖ ప్రభుత్వానికి సమగ్ర వివరణ ఇచ్చింది. మొత్తంగా రూ. 25,128 కోట్ల అవసరాలను నివేదికలో చూపింది.
ఇందులో పాత బకాయిలు రూ. 5,046 కోట్లను చెల్లించడంతోపాటు అదనంగా మరో రూ. 20,082 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరింది. ఒక్కో ఆర్థిక సంవత్సరానికి కేటాయిస్తున్న బడ్జెట్‌ను వచ్చే ఆరు నెలల్లోనే నెలకు రూ. 4 వేల కోట్లకు తగ్గకుండా ఇవ్వాలని పేర్కొంది. ఇందులో గరిష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ. 9 వేల కోట్ల మేర నిధులు అవసరమని నీటిపారుదలశాఖ తెలిపింది. మరోవైపు వచ్చే ఆరు నెలల వ్యవధిలో పూర్తయ్యే, గరిష్టంగా 8 లక్షల ఎకరాలకు ఆయకట్టునిచ్చే పాలమూరు ప్రాజెక్టులకు పూర్తి నిధులు చెల్లించాలని కోరింది.