
పల్లె ప్రగతి కార్యక్రమంలో హారీష్‌రావు
సాక్షి, వరంగల్: దేవాదుల ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే జులై లోపు ప్యాకేజీ-2, అక్టోబర్ లోపు ప్యాకేజీ-3 పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గడువులోపు పనులు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే వర్షాకాలం నాటికి రామప్ప నుంచి పాకాలకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు.
అంతకుముందు జిల్లాలోని చెన్నరావుపేట మండలం ఉప్పరపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో హరీష్‌రావు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా హరీష్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు.
మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ. 13 వేలు అందజేస్తున్నామని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులన్నింటినీ పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. మే నెల నుంచి రైతులకు పంట పెట్టుబడి పథకం కింద ఎకరాకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment