కొత్త ఆయకట్టు 1.20లక్షల ఎకరాలు
ఖరీఫ్ ఆయకట్టు లక్ష్యాలపై దిశానిర్దేశం చేసిన మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సాగునీరందాల్సిన కొత్త ఆయకట్టుపై నీటి పారుదల శాఖ కసరత్తు కొలిక్కి వచ్చింది. పనులు పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ 1.20 లక్షల ఎకరాల మేర సాగునీరందించి, రబీ నాటికి దాన్ని మరింత పెంచాలని లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ మేరకు దేవాదుల, మంథని, గూడెం సహా ఆదిలాబాద్ జిల్లాలోని పలు మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలోని కొత్త ఆయకట్టుపై అధికారులకు సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశాలు జారీచేశారు.
బుధవారం ఆయన రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలవల్ల వచ్చే నీటిని వ్యవసాయ భూములకు మళ్లింపు అంశంతోపాటు ఖరీఫ్ సాగుపై సమీక్షించారు. దేవాదుల ప్రాజెక్టు కింద చిన్న చిన్న పనులకు సంబంధించిన భూసేకరణ పూర్తిచేసి ఖరీఫ్‌లో 72వేల ఎకరాలకు సాగు నీరివ్వాలని ఆదేశించారు. కరీం నగర్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని మంథని ఎత్తిపోతల కింద 12వేల ఎకరాలకు, గూడెం ఎత్తిపోతల ద్వారా మరో 30వేల ఎకరాలకు నీరు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎల్లంపల్లి కింద 300 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తే వేములవాడలోని 50వేల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశాలున్నాయని, దీనికోసం వెంటనే ప్రతిపాదనలు పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న నీల్వాయి ప్రాజెక్టు నుంచి 4 వేల ఎకరాలు, గొల్లవాగు నుంచి 5 వేల ఎకరాలు, కొమురంభీమ్ నుంచి 1,500 ఎకరాలకు నీరు అందించాలని సూచించారు. గూడెం ఎత్తిపోతల పథకం ట్రయల్న్ రవిజయవంతంగా పూర్తయినందున ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆరంభించడానికి రంగం సిద్ధం చేయాలని సూచించారు.