
కేటీఆర్‌కు ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ప్రకటించిన స్కోచ్ సంస్థ
► ఈ నెల 9న ఢిల్లీలో పురస్కార ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ మంత్రి కె.తారక రామారావుకు స్కోచ్ సంస్థ ‘ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9న ఢిల్లీలో జరిగే 49వ స్కోచ్ సమ్మిట్‌లో అవార్డును అందజేయనున్నట్టు పేర్కొంది.
సరికొత్త భారత్ కోసం కేటీఆర్ తెలంగాణను నిర్మిస్తున్నారని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ కొనియాడారు. స్కోచ్ సంస్థ 2003 నుంచి వివిధ రాష్ట్రాల పరిపాలనను అంచనా వేస్తూ వార్షిక స్మార్ట్ గవర్నెన్స్ మ్యాప్‌ను ప్రకటిస్తోంది. గత ఏడాది తెలంగాణను అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ప్రకటించింది.