
పెదవి విరుపు
- బడ్జెట్‌పై జిల్లావాసులకు ఒరిగిందేమీ లేదు..
- ప్రస్తావనకురాని పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు
- సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు లేదు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. ఈ బడ్జెట్‌తో జిల్లాకు ప్రత్యేకంగా ఒరి గేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రధానంగా పసుపు బోర్డు ఏర్పాటు, సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు, మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ వంటి డిమాండ్‌లు ప్రధానంగా ఉన్నాయి. కేంద్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సిన ఈ అంశాలపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావనగానీ, ఆ దిశగా నిర్ణయాలేవీ లేకపోవడంతో ఆయా వర్గాల్లో నిరుత్సాహం వ్యక్తమవుతోంది.
పసుపు ప్రత్యేక బోర్డు
జిల్లాలో ఏటా సుమారు 15 వేల ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేస్తారు. పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో కూడా రైతులు ఈ పంటను ఎక్కువగా పండిస్తారు. ఎరువులు, విత్తనాల ధరలు చుక్కలనంటుతుండటంతో సాగు వ్యయం పెరిగింది. దీనికి తోడు మార్కెట్‌లో సరైన ధర లభించకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారు. కేంద్రం పసుపు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తే పసుపు రైతులకు కొంత ఊరట లభిస్తుంది.
ఈ పసుపు బోర్డు విషయంలో ప్రత్యేక ప్రకటన చేసే అవకాశాలు లేకపోయినప్పటికీ.. ఆ దిశగా చర్యలుంటాయని బడ్జెట్‌లో ఎక్కడా పేర్కొనలేదని పసుపు రైతుల సంఘం నేత కె.నర్సింహ నాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు.
సింగరేణి కార్మికుల ఆదాయపన్ను
ప్రకృతికి విరుద్ధంగా అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో విధులు నిర్వర్తించే(రిస్క్ సెక్టార్) సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ ప్రముఖంగా ఉంది. ఎన్నికల వేళ అన్ని పార్టీలు ఈ కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చాయి. జిల్లాలో సుమారు 24 వేల మంది సింగరేణి కార్మికులు ఉంటారు. ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం ప్రకటిస్తే ఈ కార్మికులకు కొంత ఊరట లభించేది. అయితే ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచడం ద్వారా అల్పాదాయ వర్గాల వేతన జీవులకు కొంత ఊరట నిచ్చినప్పటికీ, సింగరేణి కార్మికులకు మాత్రం పెద్దగా ఒరిగిందేమి ఉండదనే కార్మిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సీసీఐ వంటి పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు
అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న సిమెంట్ ధరలకు కళ్లెం వేయలేకపోతున్న ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్‌లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు తీసుకునే చర్యల అంశంపై బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడం ఆ కార్మిక వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసింది. మూత పడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరిపిస్తామని అన్ని పార్టీలు ప్రతి ఎన్నికల్లో హామీలు ఇస్తున్నప్పటికీ, ఆచరణలో ఆ దిశగా చర్యలు ఉండటం లేదు. బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కార్పొరేట్ రంగాల ప్రయోజనాలు కాపాడే విధంగా ఉందే తప్ప, పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలకు ఊతం ఇచ్చే విధంగా లేదని సీసీఐ కార్మిక సంఘం నేతలు ఎస్.విలాస్, రాజన్నలు అభిప్రాయపడ్డారు.