నిజామాబాద్ సిటీ: ప్రభుత్వానికి భారమైనప్పటికీ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ‘ఆసరా’ కల్పించాలనే ఉద్దేశంతోనే వారికిచ్చే పింఛన్ డబ్బులను పెంచామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వృద్ధులు, వితంతువులకు రూ. 200 ఉన్న పింఛన్ రూ. 1000కి, వికలాంగులకు రూ. 500 ఉన్న పింఛన్ రూ. 1500కు పెంచడంతో కేసీఆర్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చినట్లయ్యిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రూ. 75 మాత్రమే పింఛన్ ఇచ్చేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 200కు పెంచినా అది లబ్ధిదారులకు ఏ మాత్రం సరి పోకపోయేదన్నారు.
గత ప్రభుత్వాలకు పింఛన్ల భారం రూ. 1000 కోట్లు ఉంటే, తెలంగాణ ప్రభుత్వానికి ఆ భారం రూ. 4 వేల కోట్లకు పెరిగిందన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి పింఛన్‌ల కోసం 3.29 లక్షల దరఖాస్తులు రాగా 1.73 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. నగరంలో 49 వేల దరఖాస్తులు రాగా, 30 వేల ద రఖాస్తులకు మంజూరు లభించిదన్నారు. ఇంకా అనేక దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోండి
అర్హులు ఎంతమంది ఉంటే అంత మందికీ పింఛన్లు ఇచ్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. వారంతా ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్‌సీలకు 38,378, ఎస్‌టీలకు 17,703, బీసీలకు 97,057, ఓసీలకు 14,946, మైనార్టీలకు 11,221 పింఛన్లు మంజూరు చేసామని తెలిపారు. ఈ వర్గాల వధువులందరికీ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా వివాహానికి ముందే రూ. 51 వేల రూపాయల చెక్కులను అందజేస్తామన్నారు. గుడిసెలలో నివాసం ఉంటున్న పేద ప్రజ లకు రూ. 3.50 లక్షలతో 125 గజాల స్థలంలో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు.
రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించామని మంత్రి పోచారం తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లను బీటి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కిలో మీటరుకు రూ. 13 లక్షల చొప్పున 14,500 కిలో మీటర్ల బీటీ రోడ్లు, కిలో మీటరుకు రూ.39 లక్షల చొప్పున 4,160 కిలో మీటర్ల కంకర రోడ్డు, కిలో మీటరుకు రూ. 3 లక్షల చొప్పున మట్టి రోడ్లను నిర్మిస్తామని చెప్పారు.
దీని కోసం ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.10 వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.5 వేల కోట్లు కేటాయించామన్నారు. కొత్తగా నిర్మించబోయే వంతెనలకు రూ.250 కోట్లు కేటాయించామన్నారు.సమస్యా త్మకంగా మారిన డిచ్‌పల్లి నిజామాబాద్ రోడ్డును నాలుగు వరసల రహదారిగా మార్చేందుకు రూ.100 కోట్లు కేటాయించామన్నారు. పనులు అతి త్వరలో మొదలు కా నున్నాయని తెలిపారు. నిజామాబాద్ రింగు రోడ్లకు రూ. 1550 కోట్లు, 600 చెరువుల పునరుద్ధరణకు రూ. 200 కోట్లు రూపాయలు కేటాయించామన్నారు.
ప్రజలకు ఏం కావాలో సీఎంకు తెలుసు
రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు ఏం కావాలో సీఎం కేసీఆర్ బాగా ఆలోచించి ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా అన్నా రు. పట్టణ ప్రాంతాలలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారన్నారు. పిల్లల కోసం కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యా సీఎం బాధ్యత తీసుకున్నారన్నారు.
కొన్ని పార్టీలు పింఛన్లు తొలగిస్తున్నారని అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. బోగస్ పింఛన్లు మాత్రమే తొల గించి నిజమైన అర్హులకు ఇస్తున్నామన్నారు. నగరంలో ఇంకా సర్వే పూర్తి కాలేదని, సర్వే పూర్తి అయ్యాక పింఛన్ డబ్బులు చేతికి అందుతాయన్నారు.
కొత్త రాష్ట్రంలో పెద్ద బడ్జెట్
సమైక్య రాష్ట్రం బడ్జెట్ రూ. లక్ష కోట్లు ఉంటే, సీఎం కేసీఆర్ తెలంగాణ బడ్జెట్ కూడా రూ. లక్ష కోట్లతో బడ్జెట్ రూపొందించారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బా జిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇదే, రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపిస్తోందన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరూ పించన్లు కోసం దరఖాస్తు పెట్టుకోవాలని సూచిం చారు.
వృద్ధుల పింఛన్లను కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసి తీసుకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయరు ఆకుల సుజాత, కలెక్టర్ రొ నాల్డ్ రోస్, ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఫయీమ్, జడ్‌పీ వైస్ చైర్ పర్సన్ సుమనారెడ్డి, నిజామాబాద్ మండల అధ్యక్షుడు యాదగిరి, జడ్‌పీటీసీ పుప్పాల శోభ, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం, ఆర్‌డీఓ యాదిరెడ్డి, నిజామాబాద్ మండల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
భారమే అయినా..
Published Sun, Nov 9 2014 3:13 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement