సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) కు నగరం ముస్తాబైంది. జీఈఎస్‌లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇవాంకకు అధికారులు ఘన స్వాగతం పలికారు.
అయితే ఇవాంకా రావడానికి మునుపే హైదరాబాద్‌లో హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. ఆమె పర్యటనలో భాగంగా చార్మినార్‌ను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అధికారులు చార్మినార్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. దాంతో పాటు గాజులకు ప్రసిద్ధిగాంచిన లాడ్ బజార్‌లో ఇవాంకా షాపింగ్ చేస్తుందనే సమాచారంతో అక్కడి వ్యాపారులు వారి సృజనాత్మకతకు పదును పెట్టారు. ఇవాంక పర్యటన నేపధ్యంలో లాడ్ బజార్ వ్యాపారులు 'భారత-అమెరికా స్నేహం' పై ప్రత్యేకంగా గాజులు తయారు చేశారు.
గాజుల మీద ఇవాంకా పేరుతో పాటు ఇండియా, అమెరికా జాతీయ జెండాలను కూడా వేశారు. ' ఇవాంకా ట్రంప్ కోసం ప్రత్యేకంగా ఈ గాజులను తయారు చేశాను. ఈ గాజుల సెట్ ను తయారు చేయడానికి 45 రోజులు పట్టింది. ఆమె లాడ్ బజార్ ను సందర్శిస్తే ఈ గాజులను అమెకు బహుమతిగా అందజేస్తాం' అని వ్యాపారి మహ్మద్ అన్వర్ తెలిపారు. ఇవాంకా లాడ్ బజార్‌లో షాపింగ్ చేస్తుందో లేదో తెలియదు కానీ ఆమె పేరుతో తయారు చేసిన బ్యాంగిల్స్ నగర మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment