- రైతు ఆత్మహత్యలు, విద్యుత్ కొరతపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి నాలుగేళ్లపాటు దిశానిర్ధేశం చేసిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) మళ్లీ క్రియాశీలం కావాలని నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కార్యాచరణకు దూరంగా ఉన్న జేఏసీ రాష్ట్రంలో క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు కొరత, రైతు ఆత్మహత్యలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించింది.
విద్యుత్తు కొరతకు కారణాలు, సమస్యను అధిగమించడానికి పరిష్కార మార్గాలపై అధ్యయనం చేయనుంది. పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి నివేదించనుంది. ఇందులో భాగంగా భాగస్వామ్య సంఘాల నిపుణులతో అధ్యయనం చేయనుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుండడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్న జేఏసీ, రైతుల ఆత్మహత్యలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని నిర్ణయించింది.
నేడు జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ : పిట్టల రవీందర్
జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరగనుందని సమన్వయకర్త పిట్టల రవీందర్ శనివారం తెలిపారు. విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై ఇందులో చర్చిస్తామని పేర్కొన్నారు.