త్రిపురాదం(నాగర్జునసాగర్) : పర్యాటకకేంద్రంగా పేరొందిన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి ఏడు పర్యాయాలు విజయం సాధించిన కుందూరు జానారెడ్డి సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. అదే విధంగా ఎన్టీఆర్ మంత్రి వర్గంలో 1983, 1985లో కుందూరు జానారెడ్డి 13 శాఖల మంత్రిగా రికార్డుకెక్కారు. నిమ్మల రాములు వరుసగా మూడు పర్యాయాలు గెలుపొంది హ్యాట్రిక్ సాధించగా కుందూరు జానారెడ్డి డబుల్ హ్యాట్రిక్ దాటి చరిత్ర సృష్టించారు. 1962లో పెద్దవూర నియోజకవర్గంలో జరిగిన తొలి ఎన్నికల్లో సీపీఐ పార్టీ అభ్యర్థిగా పీ.పర్యతరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీఎన్.రెడ్డిపై 2,302 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలి ఎమ్మెల్యేగా నిలిచారు.
ఆ తర్వాత 1967లో చలకుర్తి నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ జరిగిన తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిమ్మల రాములు సీపీఎం నుంచి ఎం. ఆదిరెడ్డిపై 6656 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967 నుంచి 2004 వరకు చలకుర్తి నియోజకవర్గంగా కొనసాగింది. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన అనంతరం చలకుర్తి నియోజకవర్గ స్థానంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పేరుతో 2009లో కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. సాగర్ నియోజకవర్గంలో అనుముల, నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర, గుర్రపోడు, తిరుమలగిరి మండలాలు ఉన్నాయి. 1962లో సీపీఐ నుంచి గెలిచిన పీ.పర్వతరెడ్డి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగలేదు.
2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏర్పాటు
1952 నుంచి జరిగిన మార్పు, చేర్పుల వల్ల 2009లో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏర్పడింది. 1952లో ఈ నియోజకవర్గం కొంత ప్రాంతం పెద్దమునిగల్ నియోజకవర్గంలో ఉంది. 1957లో దేవరకొండ నియోజకవర్గం పరిధిలోకి వచ్చింది. ఆ తరువాత 1962లో పెద్దవూర నియోజకవర్గంగా ఏర్పడింది. 1967లో చలకుర్తి నియోజకవర్గంగా మారింది. తిరిగి 2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పటివరకు చలకుర్తిలో ఉన్న దామరచర్ల మండలాన్ని మిర్యాలగూడలోకి కలిపి దేవరకొండలో ఉన్న గుర్రంపోడు మండలాన్ని సాగర్ నియోజకవర్గంలో కలిపారు.
సుదీర్ఘకాలం మంత్రిగా జానారెడ్డి రికార్డు
నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఏడుసార్లు ప్రాతినిధ్యం వహించిన కుందూరు జానారెడ్డి రాష్ట్ర శాసనసభ చరిత్రలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం 15ఏళ‍్లకు పైబడి మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. అంతేకాదు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో 13 మంత్రిత్వశాఖలు చేసి జానారెడ్డి రికార్డుకెక్కారు. అదేవిధంగా ఏకంగా ఏడు ఎన్నికల్లో జానారెడ్డి విజయం సాధించి ఎనిమిదో విజయంపై దృష్టి సారించారు. 1978 ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ఆయన జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా 1983, 1988 ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించారు.
ఆ తరువాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. అనంతరం 1994 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జానారెడ్డి ఆ తర్వాత వరుసగా 1999, 2004, 2009, 2014 నాలుగు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది పర్యాయాలు ఎన్నికల బరిలో నిలిచిన జానారెడ్డి రెండుసార్లు ఓటమి పాలుకాగా, ఏడు పర్యాయలు విజయం సాధించి 2018 ఎన్నికల్లో ఎనిమిదో విజయం సొంతం చేసుకోవడంపై గురిపెట్టారు.
నిమ్మల, జానారెడ్డి మధ్యే ఎక్కువసార్లు పోటీ
1967, 1972, 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు ఇండిపెండెంట్, కాంగ్రెస్ తరుపున పోటీచేసి నిమ్మల రాములు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1967, 1972లో సీపీఎం, ఇండిపెండెంట్ తరపున పోటీ చేసిన ఎం. ఆదిరెడ్డిపై ,1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన జానారెడ్డిపై నిమ్మలరాములు వరుసగా మూడు సార్లు గెలుపొందారు. అప్పటి వరకు నిమ్మల రాములు పేరున ఉన్నహ్యాట్రిక్ రికార్డును కుందూరు జానారెడ్డి అధిగమించి డబుల్ హ్యాట్రిక్‌ను దాటిపోయారు. డబుల్ హ్యాట్రిక్ దాటిన జానారెడ్డి రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు. 1994 ఎన్నికల్లో జానారెడ్డిపై టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన గుండెబోయిన రాంమ్మూర్తియాదవ్ విజయం సాధించారు. ఈ ఎన్నికలో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో జానారెడ్డి ఏడు పర్యాయాలు విజయం సాధించారు.
వ్యవసాయమే ఆధారం
నాగార్జునసాగర్ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతంలోని 80శాతం మంది వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నియోజకవర్గంలో అనుముల, నిడమనూరు, త్రిపురారం మండలాల గుండా సాగర్ ఎడమ కాల్వ ప్రవహిస్తుంది. కానీ సగమే ఆయకట్టు కాగా మిగిలిన సగం ఆయకట్టేతర ప్రాంతం. ఆయకట్టు ప్రాంతంలో రైతులు వరిసాగుచేస్తుండగా, ఆయకట్టేతర ప్రాంతంలో మెట్టపంటలను పండిస్తున్నారు. గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో కొంత వరకు ఎస్‌ఎల్‌బీసీ ద్వాదా సాగునీరందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment