
‘మత కోణంలో చూడడం కరెక్ట్ కాదు’
హైదరాబాద్: ముస్లింలకు నాలుగు శాతం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లను మత కోణంలో చూడడం సరికాదన్నారు. రిజర్వేషన్ల పెంపుదల బిల్లుపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన మట్లాడారు. విద్యా, ఉద్యోగాల్లో కాదు రాజకీయాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించిందని గుర్తు చేశారు. చట్టమైన ఇబ్బందులు ఎదురుకావడంతో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని తెలిపారు. ఇప్పటికీ ఇవే అమలు చేస్తున్నారని చెప్పారు. 40 పాలన తర్వాత 4 శాతం రిజర్వేషన్లు తెచ్చిన ఘనత తమ పార్టీదేనని వెల్లడించారు.
అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీయిచ్చిందని, అధికారంలోకి వచ్చాక 9 నెలల దాకా కమిషన్ వేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని.. 4 నెలల్లోనే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పలేదన్నారు. రిజర్వేషన్ పెంపు బిల్లుకు మద్దతిస్తామని, అయితే బిల్లు ఏవిధంగా అమల్లోకి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్ లో చేర్చకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రంతో బిల్లును ఆమోదింపజేసుకుంటామన్న విశ్వాసం తమకుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.