
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశాలు
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మన్‌గా ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియం వేదికగా తొలిసారిగా ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
మే 1, 3 తేదీలలో జిల్లా కేంద్రంలో ఎంపికలు
10 కొత్త జిల్లాల నుంచి అవకాశం
కరీంనగర్ సిటీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మన్‌గా ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియం వేదికగా తొలిసారిగా ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణలోని పది కొత్త జిల్లాల నుంచి అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఈ మేరకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉద్యోగ అర్హతలు, ఏర్పాట్లపై విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
మే ఒకటో తేదీన హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం కొత్త జిల్లాలకు చెందిన అభ్యర్థులకు, మే 3న కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల అభ్యర్థులకు ఉదయం 5 గంటల నుంచి 10 గంటలలోపు గేట్ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. అభ్యర్థులు 165 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా 10+2 తత్సమాన పరీక్షలో 50 శాతంతో ఉత్తీర్ణులై ఉండాలి. 50 శాతం ఇంగ్లిష్‌లో మార్కులు పొంది ఉండాలి. ఉదయం 6 గంటల నుంచి రాతపరీక్ష ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్‌లో ఉంటుంది.
అభ్యర్థులు 17 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు మూడు సెట్ల జిరాక్స్ ప్రతులు, 8 పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తెచ్చుకోవాలి. స్థానికతను గుర్తించేందుకు నేటివిటీ సర్టిఫికెట్ తప్పనిసరి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మరుసటి రోజు సైకాలజీ టెస్టు ఉంటుంది.
ఆ టెస్టులో ఉత్తీర్ణులైన వారికి పరుగు పందెం 7 నిమిషాలలో 1.6 కి.మీ ఉంటుంది. అనంతరం వ్యాయామ టెస్టుల్లో భాగంగా 10 పుషప్స్, 10 సిట్టప్స్, 20 స్క్వైర్స్ పరీక్ష ఉంటుంది. అనంతరం గ్రూప్ డిస్కషన్‌లో ప్రత్యేక అంశంపై చర్చించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.airmenselection.gov.in వెబ్‌సైట్ చూడొచ్చని ఆయన వివరించారు.