జోగిని శ్యామల (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: సికింద్రబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో ఆర్చిగేటు, దేవాలయం ప్రధాన ద్వారం వద్ద బోనంతో వెళుతున్న తనతో పాటు తన బృందాన్ని అడ్డుకోవడంతో మనస్థాపం చేందానని, అందుకే అలా మాట్లాడానని జోగిని శ్యామల వివరణ ఇచ్చారు. తాను ప్రభుత్వాన్ని నిందించాలనేది తన ఉద్దేశం కాదని, అక్కడున్న అధికారుల తీరుతో వారిని ఉద్దేశించి మాట్లాడానన్నారు. మంగళవారం ఆమె దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తలపై బోనాలు పెట్టుకుని శివసత్తులు డ్యాన్సులు చేస్తూ భక్తిభావంతో అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు బోనాల సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుతారన్నారు. తాను అనని మాటలను సోషల్ మీడియాలో వక్రీకరించి ముఖ్యమంత్రి తదితరులను ఉద్దేశించి అన్నట్లు చూపిస్తుండడం బాధకలిగించిందన్నారు. రాబోయే రోజుల్లో శివసత్తులందరికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడంతో పాటు, శివసత్తులు ఏ దేవాలయానికి వెళ్లినా అమ్మవారి సన్నిధికి వెళ్లేలా ప్రత్యేక జీఓ చేయాలని ఆమె కోరారు. శివసత్తులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు చెప్పినట్లు ఆమె తెలిపారు.
ఎలాంటి తప్పు జరగలేదు: ఈఓ అన్నపూర్ణ
జోగిని శ్యామల విషయంలో దేవాలయం నుంచి ఎలాంటి తప్పు జరగలేదని ఈఓ అన్నపూర్ణ తెలిపారు. శ్యామలతో పాటు వచ్చిన వీఐపీలు అందరికి దేవాలయ సంప్రదాయం ప్రకారం పూజలు చేయించి పంపించామన్నారు. ఈ సంవత్సరం 1008 బోనాలతో కలిసి వచ్చి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ప్రపంచ రికార్డుగా వివరించారు. ఇంత పెద్ద జాతరలో చిన్నచిన్న తప్పులు జరిగి ఉండవచ్చని, భక్తులు పూర్తిగా సహకరించారన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేటర్ అరుణగౌడ్ ప్రత్యేక శ్రద్ధతో అన్ని శాఖల అధికారులను సమన్వయంతో ఏర్పాట్లు చేశారన్నారు.
సంబంధిత కథనాలు:
Comments
Please login to add a commentAdd a comment