జూడాల సమ్మె విరమణ  | Judas Strike called off | Sakshi
Sakshi News home page

జూడాల సమ్మె విరమణ 

Published Sat, Aug 10 2019 2:42 AM | Last Updated on Sat, Aug 10 2019 2:42 AM

Judas Strike called off - Sakshi

శుక్రవారం సచివాలయంలో జూడాల నేతలతో చర్చిస్తున్న మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్లు (జూడాలు) సమ్మె విరమించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ మెడికల్‌ కమిషన్‌ చట్టపై కొద్ది రోజులుగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జూడాలు, ఐఎంఏ ప్రతినిధులు వైద్య సేవలు నిలిపేసిన సంగతి తెలిసిందే.  ఫలితంగా ఆరోగ్యశ్రీ రోగులు మొదలు అనేక మంది రోగులు వైద్యం అందక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం సచివాలయంలో జూడాల నేతలతో చర్చలు జరిపారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌తో తాను జరిపిన చర్చల గురించి జూడాలకు వివరించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మె విరమించుకున్నారని చెప్పారు.

తెలంగాణలోనే సమ్మె చేయడం వల్ల రోగులకు ఇబ్బంది తప్ప ఏ ప్రయోజనం లేదని స్పష్టంచేశారు. సమ్మె విరమించాలని, ఎన్‌ఎంసీపై ఉన్న అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, సవరణలు చేసేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌ఎంసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో చట్టమైంది. పార్లమెంట్‌ సమావేశాలు కూడా ముగియడంతో సమ్మె కొనసాగించడం వల్ల లాభం లేదని భావించిన జూడాలు వెనక్కు తగ్గారు. తాము చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు జూడా అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయేందర్‌ ప్రకటించారు. శనివారం నుంచి విధులకు హాజరవుతామన్నారు.

సెలవు రోజులైనా ఓపీ సేవలు చేస్తామన్నారు.  త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.  వైద్య రంగంలో వస్తున్న పరిణామాలపై మంత్రి ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. జూడాలతో చర్చల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎంబీబీఎస్‌ డాక్టర్‌ అన్ని రకాల రోగాలకు వైద్యం చేసేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఎన్నో స్పెషల్‌ కోర్సులు చేయాల్సి వస్తోందని, దీంతో వైద్య విద్యార్థులపై ఎంతో భారం పడుతోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement