చిన్నపెండ్యాల (స్టేషన్‌ఘన్‌పూర్) : ‘పల్లె ప్రజల ఆరోగ్యం - జూనియర్ డాక్టర్ల లక్ష్యం’ నినాదంతో చలో పల్లె కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని చిన్నపెండ్యాల పంచాయతీ ఆవరణలో మంగళవారం జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం ఉస్మానియా, ఎంజీఎం, గాంధీ ఆస్పత్రుల నుంచి 45 మంది డాక్టర్లు గ్రామానికి రాగా... శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ తాళ్లపల్లి సమ్మయ్య గౌడ్, ఉపసర్పంచ్ గుంపుల రవీందర్ రెడ్డి ప్రారంభించారు.
శిబిరానికి వచ్చిన రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తే స్థానికంగా ఉంటూ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం 44 రోజులుగా సమ్మె చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తే ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమేనని మొదటిరోజు నుంచి చెబుతున్నామని, అయినా ప్రభుత్వం స్పందించకుండా తమపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
ప్రజలే ప్రభుత్వం అయినందున గ్రామాల్లోకి వచ్చి తమకు జరుగుతున్న అన్నాయాన్ని వివరిస్తున్నామన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల ఆరోగ్య వ్యస్థకు జరిగే అన్నాయాన్ని ఎదుర్కోమని చెప్పేందుకే చలో పల్లె కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
చిన్నపెండ్యాలలో జూనియర్ డాక్టర్లు
Published Wed, Nov 12 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement