గులాబీ దళంలో నూతనోత్సాహం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో గులాబీ పార్టీ బలం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ టీఆర్‌ఎస్ పార్టీకి నలుగురు శాసనసభ్యులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఆరుకు పెరిగింది. తెలంగాణలో అధికారం చేపట్టి ఊపుమీదున్న ఆ పార్టీ క్రమంగా ప్రతిపక్షాలను బల హీనం చేసేందుకు.. తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు ‘ఆకర్ష్’ మంత్రానికి తెరలేపింది. ఆ మంత్రానికి ఆకర్షితులై ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. తాజాగా ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
అభివృద్ధి కోసమంటూనే..
అధికారంలో ఉన్న పార్టీలో చేరితే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో నిధులు ఎక్కువ రాబట్టేందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కాలె యాదయ్య ప్రకటించారు. ఆదివారం కేసీఆర్ సమక్షంలో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మారిన యాదయ్య తన మాజీ పార్టీ నేతలకు చురకలంటించారు. గతంలో మంత్రులుగా పనిచేసి చక్రం తిప్పిన నేతలు ప్రస్తుతం జిల్లాను పట్టించుకోవడంలేదని విమర్శించారు. చేవెళ్లకు భారీగా నిధులివ్వాలని సీఎంను కోరగా.. ఆయన స్పందిస్తూ వెయ్యి ఎకరాల్లో ప్రత్యేకంగా ఉద్యాన సాగుకు ప్రోత్సహిస్తామని, అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అక్కడ హంగామా.. ఇక్కడ మూగనోము..
కాలె యాదయ్య టీఆర్‌ఎస్‌లో చేరడంపై ఆయన వర్గంలో నూతనోత్సాహం కనిపించింది. ఆయనతో పాటు ఆయన వర్గీయులుగా ముద్రపడిన పలువురు నాయకులు టీఆర్‌ఎస్ గూటికి చేరారు. మరోవైపు ఇప్పటికే టీఆర్‌ఎస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వర్గీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారకులైన వారిని పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకు వివరించగా.. ఆయన అప్పట్లో సర్ది చెప్పి పంపారు. తాజాగా ఆదివారం యాదయ్య చేరిన సమయంలోనూ తమకు ఆహ్వానం లేదంటూ రత్నం వర్గీయులు దూరంగా ఉన్నారు. ఒకవైపు బలం పెరుగుతుండడంతో ఉత్సాహంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు తాజా చేరికలు ఏమేరకు కలిసివస్తాయో వేచి చూడాల్సిందే.