Tigala Krishna reddy
-
అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది? సైలెంట్ అవ్వడం తాత్కాలికమేనా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీలో అసమ్మతి స్వరం పెరుగుతోంది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా, తాజాగా మహేశ్వరంలో మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సబితారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం అభివృద్ధే ధ్యేయమంటూ హస్తం పార్టీకి బైబై చెప్పి.. గులాబీ కండువా వేసుకున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక్కడ అధికార పార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలైన నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి అధిష్టానం హామీతో తాత్కాలికంగా సైలెంట్ అయ్యారు. కోడలు అనితారెడ్డికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టడంలో సఫలీకృతుడయ్యారు. ఇదిలా ఉండగా పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో తనకు సరైన ప్రాధాన్యః దక్కడం లేదంటూ ఇటీవల ధిక్కార స్వరం అందుకున్నారు. భగ్గుమంటున్న విభేదాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. తుక్కుగూడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్కు మెజార్టీ స్థానాలు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఆయనను చైర్మన్‌గా ఎన్నుకుంది. ఆ తర్వాత మంత్రితో చైర్మన్‌కు పొసగకపోవడంతో ఆయన టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. అధికార పార్టీ ఇక్కడ మేయర్లుగా ఎన్నికయ్యారు. వీరిలో బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత.. మంత్రి సబితకు మధ్య అంతర్గత విబేధాలు తార స్థాయికి చేరాయి. మంత్రితో పొసగక మేయర్ దంపతులు, మరో ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అసమ్మతి వర్గం కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్న సమయంలోనే అనూహ్యంగా గత మంగళవారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మంత్రినే టార్గెట్ చేస్తూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఇదంతా టీ కప్పులో తుఫాను వంటిదేనని, అన్నతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతానని సబిత ప్రకటించారు. నేతల చూపు.. కాంగ్రెస్ వైపు పరిస్థితి చక్కబడకముందే బుధవారం అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత కొత్త మనోహర్‌రెడ్డి మంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. మొదటి నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న మనోహర్‌రెడ్డితో పాటు మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు బడంగ్పేట్, మీర్‌పేటకు చెందిన మరికొందరు కార్పొరేటర్లు కూడా అసమ్మతి స్వరం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన జిల్లా అధిష్టానం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతి స్వరం పెంచిన సీనియర్లంతా త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. -
కారు ‘ఓవర్‌లోడు’ సౌండ్.. సుమారు 45 నియోజకవర్గాల్లో నువ్వా నేనా?
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీని బహుళ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో కారు ఓవర్ లోడ్ కావడం కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 45 స్థానాల్లో టీఆర్ఎస్ బలమైన బహుళ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మరో 20 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితా లను కొంతమేర ప్రభావం చూపగలిగే నేతలు ఉన్నారు. మొత్తంగా కనీసం 30 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. సొంత పార్టీలోని బలమైన నేతలతో తలపడాల్సిన పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ తమనే వరిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కొన్ని సెగ్మెంట్లలో సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం దొరకక పోవచ్చనే వార్తలు ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరోవైపు తమకు టికెట్ కష్టమని భావి స్తున్నవారు.. విపక్ష పార్టీలు చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అవకాశంగా తీసుకుని ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా సొంతదారి చూసుకుంటున్నారు. మరికొందరు అసంతృప్త నేతలు మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నేతల అంతర్గత విభేదాలపై ఆరా తీసిన అధినేత ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. చదవండి👉🏼సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు పీకే నివేదికల నేపథ్యంలో.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం ఈ ఏడాది మార్చిలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు అందజేసింది. ఈ నివేదికలను లోతుగా పరిశీలించి, ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో ఉండే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో సిట్టింగులు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సొంత రాజకీయ అస్తిత్వం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్పనిసరి స్థితిలో కొందరు నేతలు ఇప్పటినుంచే సొంతదారిని వెతుక్కునే పనిలో పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కదని భావించిన అసంతృప్త నేతలు నల్లాల ఓదెలు (చెన్నూరు), బూడిద భిక్షమయ్య (ఆలేరు), విజయారెడ్డి (ఖైరతాబాద్), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) తదితరులు ఇప్పటికే సొంతదారి చూసుకున్నారు. చదవండి👉🏼కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే! ప్రత్యర్థితో బహిరంగ యుద్ధం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న కొద్దీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు పలువురు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఓ వైపు పార్టీపై, అధినేతపై విశ్వాసం ప్రకటిస్తూనే మరోవైపు స్థానికంగా ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థితో బహిరంగ యుద్ధానికి దిగుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు..ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, తాండూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి..మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బొంతు జన్మదినం పురస్కరించుకుని మంగళవారం భారీయెత్తున దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గం కూడా ఈ జాబితాలో చేరింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. హుస్నాబాద్, నకిరేకల్ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల నడుమ ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోంది. రేగ కాంతారావు, పాయం వెంకటేశ్వర్లు (పినపాక), భానోత్ హరిప్రియ, కోరం కనకయ్య (ఇల్లందు), వనమా వెంకటేశ్వర్రావు, జలగం వెంకటరావు (కొత్తగూడెం), కందాల ఉపేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు (పాలేరు) ఈ జాబితాలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరినవారు కావడం గమనార్హం. ఆధిపత్య పోరు కొనసాగుతున్న మరికొన్ని నియోజకవర్గాలు, నేతలు -
‘తీగల’కు తాఖీదులు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: గులాబీ గూటికి చేరిన మరో శాసనసభ్యుడికి నోటీసులందాయి. ఇటీవల సైకిల్ దిగి కారెక్కిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సోమవారం స్పీకర్ కార్యాలయం తాఖీదులిచ్చింది. పార్టీ ఫిరాయింపుచట్టం కింద అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వివరణ ఇవ్వాలని శాసనసభాపతి మధుసూదనాచారి ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు ఇటీవల నోటీసులు జారీచేసిన స్పీకర్.. తాజాగా టీడీపీకి గుడ్‌బై చెప్పి అధికారపార్టీ తీర్థం పుచ్చుకున్న తీగలకు నోటీసులివ్వడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నియమావళి ప్రకారం ఒక పార్టీ నుంచి ఎన్నికై.. మరో పార్టీలో చేరితే ఫిరాయింపుచట్టం వర్తిస్తుంది. ఈ మేరకు ఇరువురి సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని ఆయా పార్టీల శాసనసభాపక్ష నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వీరిరువురిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో బలంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లకు దీటుగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. ఈ క్రమంలోనే విపక్ష పార్టీల నేతలను గులాబీ గూటికి చేర్చడంలో సఫలీకృతులయ్యారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై వల విసిరారు. అనంతరం తీగల, కాలెను తమ పంచన చేర్చుకున్నారు. వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ నాయకత్వం.. తమ పార్టీ నేతలను ఎగరేసుకుపోవడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఫిరాయింపు చట్టం కింద పార్టీ మారిన సభ్యులపై వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారపార్టీ వైపు చూస్తున్న మరికొందరు సభ్యులు అనర్హత వేటు భయంతోనైనా వెనక్కి తగ్గుతారని ఇరుపార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనర్హత పిటిషన్లపై చర్య తీసుకోవాలని శాసనసభాపతిపై ఒత్తిడిని తీవ్రం చేశాయి. -
గులాబీ దళంలో నూతనోత్సాహం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో గులాబీ పార్టీ బలం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ టీఆర్ఎస్ పార్టీకి నలుగురు శాసనసభ్యులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఆరుకు పెరిగింది. తెలంగాణలో అధికారం చేపట్టి ఊపుమీదున్న ఆ పార్టీ క్రమంగా ప్రతిపక్షాలను బల హీనం చేసేందుకు.. తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు ‘ఆకర్ష్’ మంత్రానికి తెరలేపింది. ఆ మంత్రానికి ఆకర్షితులై ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. తాజాగా ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అభివృద్ధి కోసమంటూనే.. అధికారంలో ఉన్న పార్టీలో చేరితే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో నిధులు ఎక్కువ రాబట్టేందుకే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కాలె యాదయ్య ప్రకటించారు. ఆదివారం కేసీఆర్ సమక్షంలో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మారిన యాదయ్య తన మాజీ పార్టీ నేతలకు చురకలంటించారు. గతంలో మంత్రులుగా పనిచేసి చక్రం తిప్పిన నేతలు ప్రస్తుతం జిల్లాను పట్టించుకోవడంలేదని విమర్శించారు. చేవెళ్లకు భారీగా నిధులివ్వాలని సీఎంను కోరగా.. ఆయన స్పందిస్తూ వెయ్యి ఎకరాల్లో ప్రత్యేకంగా ఉద్యాన సాగుకు ప్రోత్సహిస్తామని, అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అక్కడ హంగామా.. ఇక్కడ మూగనోము.. కాలె యాదయ్య టీఆర్ఎస్లో చేరడంపై ఆయన వర్గంలో నూతనోత్సాహం కనిపించింది. ఆయనతో పాటు ఆయన వర్గీయులుగా ముద్రపడిన పలువురు నాయకులు టీఆర్ఎస్ గూటికి చేరారు. మరోవైపు ఇప్పటికే టీఆర్ఎస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వర్గీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారకులైన వారిని పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకు వివరించగా.. ఆయన అప్పట్లో సర్ది చెప్పి పంపారు. తాజాగా ఆదివారం యాదయ్య చేరిన సమయంలోనూ తమకు ఆహ్వానం లేదంటూ రత్నం వర్గీయులు దూరంగా ఉన్నారు. ఒకవైపు బలం పెరుగుతుండడంతో ఉత్సాహంలో ఉన్న టీఆర్ఎస్కు తాజా చేరికలు ఏమేరకు కలిసివస్తాయో వేచి చూడాల్సిందే. -
భారీగా నిధులు తెస్తా..
కందుకూరు: జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేంద్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు చెరువుల పునరుద్ధరణ, రహదారుల అభివృద్ధి వంటి పనులకు అధిక నిధులు వెచ్చించనున్నామన్నారు. గురువారం ఆయన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి మండలంలోని చిప్పలపల్లి, బాచుపల్లిలలో రూ.3 లక్షల చొప్పున వెచ్చించి ఏర్పాటు చేసిన ఆర్ఓఆర్ ప్లాంట్లు, తిమ్మాపూర్‌లో రూ.18 లక్షలతో తిమ్మని చెరువు మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. పేదలకు లబ్ధిపొందే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇబ్రహీపట్నం, మహేశ్వరం ప్రాంతాలకు కృష్ణానీటి సరఫరా కోసం అదనంగా రూ.52 కోట్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో 400 పల్లెవెలుగు, వంద ఎసీ బస్సులు అదనంగా రానున్నాయని, ప్రతి జిల్లా కేంద్రానికి ఏసీ బస్సులు నడిపిస్తామన్నారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ: తీగల బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే తాను టీఆర్ఎస్లో చేరానని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు మాని అభివృద్ధిలో కలిసిరావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనేగౌని అశోక్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, వైస్ ఎంపీపీ సంధ్యా దామోదర్‌గౌడ్, టీఆర్ఎస్ నియోజకరవ్గ ఇన్చార్జి కొత్త మనోహర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చల్లా మాధవరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు చెన్నకేశ్వర్, జాగృతి అధ్యక్షురాలు జయమ్మ, సర్పంచ్‌లు సుదర్శనాచారి, హరిత, దేవిపాండు, యాదయ్య, ఎంపీటీసీ సభ్యులు జయమ్మ, నీలమ్మ, ఆర్డీఓ యాదగిరిరెడ్డి, తహసీల్దార్ సుశీల, ఎంపీడీఓ అనూరాధ పాల్గొన్నారు. -
కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేత ం కోసం తలపెట్టిన ఆకర్ష్ ఫలిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం గులాబీదళం వైపు ఆకర్షితులవుతున్నారు. జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కలిసి.. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించగా.. తాజాగా బుధవారం సాయంత్రం అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నారు. టీకేఆర్ కాలేజీ ఆవరణలో తన అనుచరగణంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు తీగల వర్గం ఏర్పాట్లలో నిమగ్నమైంది. బల ప్రదర్శనే లక్ష్యంగా.. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు దాదాపు నెలన్నరగా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. బుధవారం అధికారికంగా పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా టీకేఆర్ కాలేజీని వేదికగా చేసుకున్న ఆయన.. నియోజకవర్గంలోని తన సొంత బలగంతో పార్టీ కండువా వేసుకోనున్నారు. ఈక్రమంలో ఇటీవల పలుమార్లు తనవర్గ నేతలు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశం నిర్వహించి చర్చించారు. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులంతా తీగలకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. పార్టీ మారే అంశంపై మాత్రం భిన్నరకాలుగా స్పందించారు. కొందరు కార్యకర్తలు నిర్ణయాన్ని వ్యతిరేకించగా.. మరికొందరు స్వాగతించారు. ఈ క్రమంలో అనుచరగణంలోనూ సమన్వయం దెబ్బతింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్న సందర్భంగా భారీస్థాయిలో బల ప్రదర్శన నిర్వహించా లని తీగల నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. బుధవారం సాయంత్రంకల్లా తీగల బలప్రదర్శన ఏమిటో బహిర్గతం కానుంది. మరోవైపు తీగల చేరికపై స్థానిక టీఆర్ఎస్ నాయకులు హర్షిస్తున్నప్పటికీ.. ఇటీవల పార్టీ తరఫున ఎన్నికల బరిలో పోరాడిన నేతలు ప్రస్తుతం మూగనోము ప్రదర్శించడం వెనుక ఆంతర్యమేమిటో మరికొన్ని రోజుల్లో బయటపడనుంది. -
గులాబీ గూటికి తీగల?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా టీడీపీ సీనియర్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ముహూర్తం కూడా దాదాపుగా ఖరారు చేసుకున్న ఆయన భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా పార్టీ మారనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన ఖండిస్తున్నప్పటికీ, సన్నిహితులతో అత్యవసర భేటీ నిర్వహిస్తుండడం ఆయన కారెక్కడం ఖాయమనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది. మరోవైపు తీగల మాత్రం ఇదంతా తనపై సాగుతున్న దుష్ర్పచారం అని కొట్టిపారేస్తున్నారు. పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామే తప్ప.. పార్టీని వీడాలనే అంశం ఈ భేటీలో చర్చించడంలేదని స్పష్టంచేశారు. అయితే, పార్టీ నేతల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని వ్యాఖ్యానించడం వెనుక అంతర్యం వేరే ఉందని అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు విధేయుడిగా మెలిగే తీగలకు గతంలో హైదరాబాద్ నగర మేయర్ పదవిని కూడా కట్టబెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి శాసనసభకు ఎన్నికై చట్టసభకు వెళ్లాలనే చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు. అయితే, ఎన్నికయిన నెలల కాలంలోనే ఆయన పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడం రాజకీయవర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. దిక్కుతోచని స్థితిలో.. తెలంగాణ లో టీడీపీని ఖాళీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలోని తెలుగుతమ్ముళ్లపై వల విసిరింది. ఈ క్రమంలోనే జిల్లాలోని మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంట్లో భాగంగాానే ఇటీవల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తోపాటు తీగల కృష్ణారెడ్డి వేర్వేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కేవలం అభివృద్ధి పనులపై చర్చించేందుకు సీఎంను కలిశామని వీరిరువురు వివరణ ఇచ్చుకున్నప్పటికీ, ఈ ఇద్దరూ గులాబీ పంచన చేరడం దాదాపుగా ఖాయమైందని, ముహూర్తమే మిగిలి ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి. జిల్లా టీడీపీలో ముఖ్య నాయకులందరూ క్రమంగా వీడిపోతుండడం ఆ పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహా వివేకానంద్, మాధవరం కృష్ణారావు కూడా సైకిల్ దిగనున్నారనే వార్తలతో దిగాలు పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల వారందరితోనూ విడి విడిగా మాట్లాడి బుజ్జగించారు. అధినేత బుజ్జగింపులతో మెత్తబడ్డారని భావించినప్పటికీ, టీఆర్ఎస్ ఆక ర్షణలో చిక్కుకున్న ఎమ్మెల్యేలు కారెక్కేందుకు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈక్రమంలోనే అనుయాయులతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న గులాబీ నాయకత్వం... జిల్లాలో బలంగా ఉన్న టీడీపీని బలహీనపరిచే దిశగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే పలువురు ప్రజాప్రతినిధులకు వల విసురుతోంది. ఇదిలావుండగా, తీగలతో విభేదించి గులాబీ పంచన చేరిన మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు.. తాజా పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. తీగల కూడా టీఆర్ఎస్లో చేరితే తమ భవిష్యత్తేంటనే అంశంపై మథనపడుతున్నారు. -
సందడే..సందడి!
కడ్తాల: ఆమనగల్లు మండలం మైసిగండి మైసమ్మ అమ్మవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం వర కు అక్కడే కాలక్షేపం చేసి..ఆనందోత్సహాలతో గడిపారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, చందంపేట జెడ్పీటీసీ సభ్యుడు బాలునాయక్ వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడే ఏర్పాటుచేసిన విందులో టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. వారికి ఆలయ ఈఓ రంగారెడ్డి, ఫౌండర్‌ట్రస్టీ శిరోలీ, గ్రామ సర్పంచ్ శేఖర్‌గౌడ్, యాదగిరిగౌడ్ స్వాగతం పలికారు. -
ఆశల పల్లకిలో..
డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి: తాను గెలిచీ.. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పీఠం ఎక్కవచ్చన్న ఆశ ఒకరిది. చట్టసభల్లో అడుగిడాలన్న వాంఛ మరొకరిది. కలగా మారిన మంత్రి పదవులను దక్కించుకోవాలనే ఆకాంక్ష ఇంకో ఇద్దరిది. రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల బరిలో ఉన్న ఆ నలుగురికి ప్రస్తుత ఎన్నికలు కీలకంగా మారాయి. టీఆర్ఎస్ తరఫున పరిగిలో పోటీ చేస్తున్న కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, తాండూరు నుంచి పోటీచేస్తున్న పట్నం మహేందర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థులుగా ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బరిలో ఉన్న ఆర్.కష్ణయ్య, తీగల కృష్ణారెడ్డిలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించే ఈ పోరులో విజయం కోసం వారు వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలయ్యారు. పరిగి.. మంత్రి పదవిపై గురి రెండు దశాబ్ధాలుగా ఓటమెరుగని హరీశ్వర్‌రెడ్డి ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యూరు. మంత్రి పదవి కలగానే మారింది. చ ంద్రబాబు సర్కారులో డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే కేబినెట్ బెర్త్ ఖాయమని భావిస్తున్న ఆయన జోరుగా ప్రచారం చేస్తూప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల ఓట్ల చీలికతో ప్రజావ్యతిరేకత నుంచి గట్టెక్కుతాననే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున టి.రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి కమతం రాంరెడ్డిలు హరీశ్వర్‌కు పోటీ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి రుక్మారెడ్డి కూడా నిర్ణయాత్మక శక్తిగా మారడం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒకప్పుడు తనకు కుడిభుజంగా ఉన్న రుక్మారెడ్డి ప్రత్యర్థిగా బరిలో దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఇవే తాను పోటీ చేసే చివరి ఎన్నికలంటున్న హరీశ్వర్ గెలిస్తే వుంత్రి కావాలన్న కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నారు. తాండూరు.. పార్టీ మారినా.. రాత మారేనా? తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ పడిపోతుందని ముందే పసిగట్టిన తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి గులాబీ గూటికి చేరారు. మంత్రి కావాలనే కోరిక టీఆర్ఎస్తో నెరవేరుతుందని భావిస్తున్నారు. టీడీపీ శ్రేణులు తన వెంట రాకపోవడంతో విజయం కోసం శ్రమించాల్సిన వస్తోంది. ఎం.నారాయణరావు (కాంగ్రెస్), ప్రభుకుమార్(వైఎస్సార్ సీపీ), ఎం.నరేశ్(టీడీపీ) బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఉద్యమకాలంలో ఉద్యోగులతో ఘర్షణ పడ్డ ఆయనను అప్పట్లో టీజేఏసీ తెలంగాణ ద్రోహిగా పేర్కొనడం ఇబ్బందికరంగా మారింది. నానాటికీ ప్రజల మద్దతు కూడగట్టుకంటున్న ప్రభుకుమార్‌పై తాజాగా దాడి చేయించడం వ్యతిరేకతను పెంచుతోంది. మహేశ్వరం.. ఒక్క ఛాన్స్! శాసనసభలో అడుగిడాలనే చిరకాల వాంఛను నెరవేర్చుకునేందుకు తీగల కృష్ణారెడ్డి చెమటోడుస్తున్నారు. 1989,1996లో హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి, 2009లో మహేశ్వరం అసెంబ్లీకి టీడీపీ తరుఫున బరిలో దిగిన ఆయనకు పరాభవమే ఎదురైంది. తాజాగా మరోసారి మహేశ్వరం నుంచి అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సౌమ్యుడిగా పేరున్న కృష్ణారెడ్డికి ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. గతంలో తనకు దక్కాల్సిన మలక్‌పేట టీడీపీ టికెట్టును ఎగురేసుకుపోయిన మల్రెడ్డి రంగారెడ్డి(కాంగ్రెస్)తో హోరాహోరీగా తలపడుతున్నారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్.. అనూహ్యంగా రంగారెడ్డికి బీ ఫారం ఇచ్చి సీపీఐకి షాక్ ఇచ్చిం ది. సీపీఐతో పెద్దగా పోటీ ఉండదని భావిం చిన తీగలకు కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో దిమ్మ తిరిగింది. మరోవైపు ఈసా రి ఎన్నికలకు దూరంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం ఆయనకు ఇబ్బందిగా మారింది. ఎంపీగా బరిలో దిగిన తనయుడు కార్తీక్‌రెడ్డికి ఇక్కడి నుంచి మంచి మెజార్టీ తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతో ఇతర పార్టీలకు చెందిన బలమైన అభ్యర్థులను సబితాఇంద్రారెడ్డి తమవైపు తిప్పుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో నామినేషన్లను విత్‌డ్రా చేయించారు. దీంతో ఇక్కడ పోటీ టీడీపీ-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధానంగా నెలకొంది. సొంత మండలమైన సరూర్నగర్పై గంపెడాశలు పెట్టుకున్న కృష్ణారెడ్డి తాడోపేడో తేల్చుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఎల్బీనగర్.. ఒత్తిడిలో సీఎం అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ అధికారికంగా ప్రకటించిన ఆర్. కృష్ణయ్య ఎల్బీనగర్లో ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. వెనుకబడిన వర్గాల కోసం ప్రజాక్షేత్రంలో పోరాడిన ఆయన తొలిసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యమ బాట వీడి రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణయ్యకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో ఒత్తిడి పెరిగింది. కొంచెం అటూ ఇటూ అయినా ఇన్నేళ్ల ఉద్యమ జీవితంలో సంపాదించుకున్న ప్రతిష్ట మసకబారుతుందని భావిస్తున్నారు. స్థానికేతరుడైన ఆయనను ఇక్కడ పోటీకి దింపడంపై మండిపడ్డ ‘దేశం’ శ్రే ణులు నామినేషన్ రోజే దాడికి దిగాయి. పలువురు సీనియర్ టీడీపీ నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం ఆయునకు ప్రతికూలంగా మారింది. సొంత పార్టీ నేతలను బుజ్జగించడం కత్తిమీద సామైంది. కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పుత్తా ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్ ఆయనమీద పోటీలో ఉన్నారు.