కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేత ం కోసం తలపెట్టిన ఆకర్ష్ ఫలిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం గులాబీదళం వైపు ఆకర్షితులవుతున్నారు. జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కలిసి.. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించగా.. తాజాగా బుధవారం సాయంత్రం అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నారు. టీకేఆర్ కాలేజీ ఆవరణలో తన అనుచరగణంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు తీగల వర్గం ఏర్పాట్లలో నిమగ్నమైంది.
బల ప్రదర్శనే లక్ష్యంగా..
టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు దాదాపు నెలన్నరగా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. బుధవారం అధికారికంగా పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా టీకేఆర్ కాలేజీని వేదికగా చేసుకున్న ఆయన.. నియోజకవర్గంలోని తన సొంత బలగంతో పార్టీ కండువా వేసుకోనున్నారు. ఈక్రమంలో ఇటీవల పలుమార్లు తనవర్గ నేతలు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశం నిర్వహించి చర్చించారు. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులంతా తీగలకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. పార్టీ మారే అంశంపై మాత్రం భిన్నరకాలుగా స్పందించారు.
కొందరు కార్యకర్తలు నిర్ణయాన్ని వ్యతిరేకించగా.. మరికొందరు స్వాగతించారు. ఈ క్రమంలో అనుచరగణంలోనూ సమన్వయం దెబ్బతింది. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్న సందర్భంగా భారీస్థాయిలో బల ప్రదర్శన నిర్వహించా లని తీగల నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. బుధవారం సాయంత్రంకల్లా తీగల బలప్రదర్శన ఏమిటో బహిర్గతం కానుంది. మరోవైపు తీగల చేరికపై స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు హర్షిస్తున్నప్పటికీ.. ఇటీవల పార్టీ తరఫున ఎన్నికల బరిలో పోరాడిన నేతలు ప్రస్తుతం మూగనోము ప్రదర్శించడం వెనుక ఆంతర్యమేమిటో మరికొన్ని రోజుల్లో బయటపడనుంది.