సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా టీడీపీ సీనియర్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ముహూర్తం కూడా దాదాపుగా ఖరారు చేసుకున్న ఆయన భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా పార్టీ మారనున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన ఖండిస్తున్నప్పటికీ, సన్నిహితులతో అత్యవసర భేటీ నిర్వహిస్తుండడం ఆయన కారెక్కడం ఖాయమనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది. మరోవైపు తీగల మాత్రం ఇదంతా తనపై సాగుతున్న దుష్ర్పచారం అని కొట్టిపారేస్తున్నారు. పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామే తప్ప.. పార్టీని వీడాలనే అంశం ఈ భేటీలో చర్చించడంలేదని స్పష్టంచేశారు. అయితే, పార్టీ నేతల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని వ్యాఖ్యానించడం వెనుక అంతర్యం వేరే ఉందని అర్థమవుతోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు విధేయుడిగా మెలిగే తీగలకు గతంలో హైదరాబాద్ నగర మేయర్ పదవిని కూడా కట్టబెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి శాసనసభకు ఎన్నికై చట్టసభకు వెళ్లాలనే చిరకాల వాంఛను నెరవేర్చుకున్నారు. అయితే, ఎన్నికయిన నెలల కాలంలోనే ఆయన పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడం రాజకీయవర్గాల్లో చర్చానీయాంశంగా మారింది.
దిక్కుతోచని స్థితిలో..
తెలంగాణ లో టీడీపీని ఖాళీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాలోని తెలుగుతమ్ముళ్లపై వల విసిరింది. ఈ క్రమంలోనే జిల్లాలోని మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంట్లో భాగంగాానే ఇటీవల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తోపాటు తీగల కృష్ణారెడ్డి వేర్వేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కేవలం అభివృద్ధి పనులపై చర్చించేందుకు సీఎంను కలిశామని వీరిరువురు వివరణ ఇచ్చుకున్నప్పటికీ, ఈ ఇద్దరూ గులాబీ పంచన చేరడం దాదాపుగా ఖాయమైందని, ముహూర్తమే మిగిలి ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి.
జిల్లా టీడీపీలో ముఖ్య నాయకులందరూ క్రమంగా వీడిపోతుండడం ఆ పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహా వివేకానంద్, మాధవరం కృష్ణారావు కూడా సైకిల్ దిగనున్నారనే వార్తలతో దిగాలు పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల వారందరితోనూ విడి విడిగా మాట్లాడి బుజ్జగించారు. అధినేత బుజ్జగింపులతో మెత్తబడ్డారని భావించినప్పటికీ, టీఆర్‌ఎస్ ఆక ర్షణలో చిక్కుకున్న ఎమ్మెల్యేలు కారెక్కేందుకు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈక్రమంలోనే అనుయాయులతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న గులాబీ నాయకత్వం... జిల్లాలో బలంగా ఉన్న టీడీపీని బలహీనపరిచే దిశగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే పలువురు ప్రజాప్రతినిధులకు వల విసురుతోంది. ఇదిలావుండగా, తీగలతో విభేదించి గులాబీ పంచన చేరిన మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు.. తాజా పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. తీగల కూడా టీఆర్‌ఎస్‌లో చేరితే తమ భవిష్యత్తేంటనే అంశంపై మథనపడుతున్నారు.
గులాబీ గూటికి తీగల?
Published Mon, Sep 29 2014 11:29 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement