‘తీగల’కు తాఖీదులు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: గులాబీ గూటికి చేరిన మరో శాసనసభ్యుడికి నోటీసులందాయి. ఇటీవల సైకిల్ దిగి కారెక్కిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సోమవారం స్పీకర్ కార్యాలయం తాఖీదులిచ్చింది. పార్టీ ఫిరాయింపుచట్టం కింద అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వివరణ ఇవ్వాలని శాసనసభాపతి మధుసూదనాచారి ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు ఇటీవల నోటీసులు జారీచేసిన స్పీకర్.. తాజాగా టీడీపీకి గుడ్‌బై చెప్పి అధికారపార్టీ తీర్థం పుచ్చుకున్న తీగలకు నోటీసులివ్వడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నియమావళి ప్రకారం ఒక పార్టీ నుంచి ఎన్నికై.. మరో పార్టీలో చేరితే ఫిరాయింపుచట్టం వర్తిస్తుంది. ఈ మేరకు ఇరువురి సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని ఆయా పార్టీల శాసనసభాపక్ష నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వీరిరువురిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో బలంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లకు దీటుగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. ఈ క్రమంలోనే విపక్ష పార్టీల నేతలను గులాబీ గూటికి చేర్చడంలో సఫలీకృతులయ్యారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై వల విసిరారు. అనంతరం తీగల, కాలెను తమ పంచన చేర్చుకున్నారు. వ్యూహాత్మకంగా టీఆర్‌ఎస్ నాయకత్వం.. తమ పార్టీ నేతలను ఎగరేసుకుపోవడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఫిరాయింపు చట్టం కింద పార్టీ మారిన సభ్యులపై వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారపార్టీ వైపు చూస్తున్న మరికొందరు సభ్యులు అనర్హత వేటు భయంతోనైనా వెనక్కి తగ్గుతారని ఇరుపార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనర్హత పిటిషన్లపై చర్య తీసుకోవాలని శాసనసభాపతిపై ఒత్తిడిని తీవ్రం చేశాయి.