
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సుడిగాలి పర్యటన జరపనున్నారు. ఇటీవలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన దాదాపు అన్ని అనుమతులూ వచ్చాయి. దీంతో పనులను మరింత వేగవంతం చేసేందుకు సీఎం క్షేత్ర పర్యటనకు వెళుతున్నారు. వరసగా మూడు రోజులపాటు ఈ ప్రాజెక్టు పరిధిలోని వివిధ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు, ఇంజనీరింగ్ నిపుణులు, సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఒక బృందంగా మూడు హెలికాప్టర్లలో బుధవారం బయలు దేరనున్నారు. బుధవారం (6వ తేదీ) సాయంత్రం 3.40 గంటలకు సీఎం కరీంనగర్‌కు బయలుదేరి 4.40 గంటలకు చేరుకుంటారు.
ఆరోజు సీఎం ఉత్తర తెలంగాణభవన్‌లో బస చేయనున్నట్లు సమాచారం. మరునాడు (గురువారం) ఉదయం 10 గంటలకు బయలుదేరి తుపాకులగూడెం బ్యారేజీని చేరుకుంటారు. అక్కడ పనులను పరిశీలించిన అనంతరం 10.40 గంటలకల్లా మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. తర్వాత 11.20కి కన్నెపల్లి పంప్‌హౌజ్ పనులను చూస్తారు. 12.20కి అన్నారం బ్యారేజీ, 12.40కి సిరిపురం పంప్‌హౌజ్‌లను సందర్శిస్తారు. సిరిపురం పంప్ హౌజ్ వద్దనే సీఎంకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం 2 గంటలకు సుందిళ్ల బ్యారేజీ, 3.30 గంటలకు గోలివాడ పంప్‌హౌజ్ పనులను పర్యవేక్షిస్తారు. గురువారం రాత్రి ఎన్టీపీసీలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు నందిమేడారంలో ప్రాజెక్టు పనులను చూసి, 12.30కి రామడుగు పంప్‌హౌజ్, సర్జ్‌పూల్ పనులను పరిశీలిస్తారు.
అక్కడే సీఎంకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశం ముగిశాక 3.40 గంటలకు మిడ్‌మానేరును పరిశీలించి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం స్వయంగా పనులు పరిశీలించే చోట హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు. కాళేశ్వరం పనులను ప్రత్యక్షంగా చూసేందుకు సీఎం పర్యటిస్తారని కొద్దిరోజులుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పరిధిలోని సున్నితమైన ప్రాంతాలను, ప్రాజెక్టు స్థలాలను ఇటీవలే రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా సందర్శించి వచ్చారు. ఆయన పర్యటన తరువాతే సీఎం పర్యటన ఖరారైనట్లు చెబుతున్నారు.