'అమ్మ మాట నన్ను ఐఏఎస్‌ దాకా నడిపించింది' | KArimangar Collector Valluru Kranthi Special Interview In Sakshi | Sakshi

'అమ్మ మాట నన్ను ఐఏఎస్‌ దాకా నడిపించింది'

Published Sun, Mar 8 2020 9:04 AM | Last Updated on Sun, Mar 8 2020 9:05 AM

KArimangar Collector Valluru Kranthi Special Interview In Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ‘ప్రజాసేవకై నాన్న నడిపిన బాట.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని అమ్మచెప్పిన మాట’ నన్ను ఐఏఎస్‌ చదివేలా చేశాయి. మాది డాక్టర్ల కుటుంబం. అయినప్పటికీ చిన్నతనం నుంచి ప్రజాసేవ చేయాలని నాకున్న మక్కువ.. దాన్ని గుర్తించిన తల్లిదండ్రులు.. వారి ప్రోత్సాహం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎన్ని ఓటములు ఎదురైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. ఈ సూత్రం నా జీవితంలో నిజమైంది. సివిల్స్‌లో రెండుసార్లు లక్ష్యాన్ని చేరుకోకపోయినా.. కృషి, పట్టుదల విజయాన్ని నా దరికి తీసుకొచ్చాయి. మూడోసారి సివిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ టాపర్‌గా నిలిచేలా చేశాయని యువ ఐఏఎస్, కరీంనగర్‌ నగరపాలకసంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

మాది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ పట్టణం. నాన్న వల్లూరి రంగారెడ్డి, అమ్మ లక్ష్మి. ఇద్దరూ వైద్యులే. అక్కయ్య అమెరికాలో ఉంటోంది. ప్రజాసేవ చేయాలని నా చిన్నతనం నుంచి నాన్న చెబుతుండేవారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని అమ్మ ఎప్పుడూ అంటుండేది. ఆ మాటలు నా మనసులో నాటుకుపోయాయి. ఎలాగైనా ప్రజాసేవ చేయాలని అప్పుడే లక్ష్యంగా పెట్టుకున్నా. కర్నూల్‌లోని భాష్యం హైస్కూల్‌లో 10వ తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్‌ పూర్తిచేశా. ఐఐటీ ఢిల్లీలో మోకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివా.

ఐఐటీ చదువుతూనే సివిల్స్‌పై దృష్టి.. 
ఐఐటీలో ఉన్నప్పుడే ‘నెక్ట్స్‌ ఏంటీ..’ అన్న అమ్మానాన్న మాటలు గుర్తొచ్చేవి. ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడే ప్రజాసేవ చేసే అవకాశం దొరుకుతుందని ఎప్పుడూ చెబుతుంటేవారు. ఆ మాటలే నన్ను సివిల్స్‌కు సిద్ధమయ్యేలా చేశాయి. ఢిల్లీలో శ్రీరామ్‌ ఇనిస్టిట్యూట్‌లో సివిల్స్‌కు ఆరునెలలు కోచింగ్‌ తీసుకున్నా. తరువాత సొంతంగా ప్రిపేరయ్యా.  బుక్స్‌తో పాటు నెట్‌లోనూ సమాచారాన్ని సేకరించా. ఇంట్లో వాళ్లంతా సైన్స్‌.. నేను మాత్రం మ్యాథ్స్‌పై ఇష్టం పెంచుకున్నా. ఆ లెక్కలే ఐఐటీలో సీటు, సివిల్స్‌లో ర్యాంకు వచ్చేలా ఉపయోగపడ్డాయి.

మూడోసారి సాధించా..
ఐఏఎస్‌ లక్ష్యంగా సివిల్స్‌కు సిద్ధమయ్యా. తొలిసారి 2013లో రాసిన సివిల్స్‌లో 562ర్యాంకు వచ్చింది. ఐఆర్‌టీఎస్‌(ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌)లో జాబ్‌ పొందాను. రెండోసారి 2014లో సివిల్స్‌ రాసి 230ర్యాంకు సాధించా. ఐఆర్‌ఎస్‌(ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌)వచ్చింది. అయినా సంతృప్తి చెందకుండా ఐఏఎస్‌ లక్ష్యంగా మరోసారి సివిల్స్‌ రాశా. 2016లో ప్రకటించిన ఫలితాల్లో 65వ ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచా. 24 ఏళ్లకే ఐఏఎస్‌ సాధించా.

శిక్షణలో ఎన్నో జ్ఞాపకాలు..
ముస్సోరిలో ఐఏఎస్‌ శిక్షణ ఇచ్చారు. జీవితంలో దేనినైనా ఎదుర్కొనే తత్వాన్ని నేర్పించారు. ప్రజాసేవలో ఎలా ముందుకు సాగాలో చూపించారు. ట్రెక్కింగ్‌ నేర్పించారు. శిక్షణలో భాగంగా కశ్మీర్‌లోని ఎల్‌ఓసీని సందర్శించా. అక్కడ పర్యటిస్తున్నప్పుడు ఆ ప్రాంత వాతావరణం నాలో ధైర్యాన్ని పెంచింది. దేశం రక్షణకు సైనికులు పడే కష్టాన్ని కళ్లారా చూశా. అక్కడికి వెళ్లిన క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి.

ఆటలు.. తెలంగాణ పాటలు ఇష్టం 
చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటలు ఇష్టం. బాస్కెట్‌బాల్‌ ఎక్కువ ఆడేదాన్ని. తరువాత టెన్నిస్, ఇప్పుడు బ్యాడ్మింటన్‌ నేర్చుకుంటున్నా. ప్రముఖుల బయోగ్రఫీ పుస్తకాలు చదవడం ఇష్టం. తెలంగాణ ఉద్యమం నేపథ్యం, సంస్కృతిపైన వచ్చిన జానపద పాటలు బాగుంటాయి. మా రాయలసీమ సంస్కృతికి ఇక్కడి వాతావరణానికి చాలా తేడా ఉంది. వరంగల్‌లో మొదటిసారి బతుకమ్మ ఆడాను. తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాక నిర్మల్‌లో శిక్షణ తీసుకున్నా. మహబూబ్‌నగర్‌లో ప్రత్యేకాధికారిగా పని చేశాను. అక్కడి నుంచి కరీంనగర్‌కు వచ్చా. మిగితా ప్రాంతాల కన్నా ఇక్కడ భిన్న వాతావరణం కనిపిస్తోంది.

పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
ఎంత ఒత్తిడితో ఉన్నా పాజిటివ్‌మైండ్‌తో ఆలోచించాలి. ఎంతటి సమస్య అయినా సులువుగా పరిష్కరించవచ్చు. ఓటమిని తట్టుకుని విజయం సాధించే వరకు మొండిగా పోరాటం సాగించాలి. మహిళలు ఉన్నత ఉద్యోగాలు పొందేందుకు కృషి చేయాలి. చాలా మంది ఎన్నో లక్ష్యాలను పెట్టుకుని, తర్వాత కుటుంబం బంధాల్లో చిక్కుకుపోతారు. వివాహాలు అయిన తర్వాత కూడా లక్ష్యాలను సాధించిన వారూ ఉన్నారు. మిగితా వారు వీరిని ఆదర్శంగా తీసుకోవాలి. సమాజంలో మనకంటూ ప్రత్యేకతను చాటాలి. ఫైనల్‌గా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement