మాట్లాడుతున్న సీపీ కమలాసన్ రెడ్డి
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నంగా మారింది. వరుసగా అక్రమాలపై దాడులు చేసి కారకులను కటకటాలకు పంపుతూ శభాష్ అనిపించుకుంటోంది. టాస్క్‌ఫోర్స్ దాడులతో గంజాయి రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారాలు, నిషేధిత గుట్కా రవాణా, విక్రయాలను వెలికితీస్తూ అక్రమార్కులపై కొరడా ఝలిపిస్తోంది. కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి సారథ్యంలో సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచి అందరి మన్ననలు పొందుతోంది.
నిందితులపై నిరంతర నిఘా...
కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి 2017, జూలై 01న ప్రారంభించారు. ఇందులో ఇద్దరు సీఐలు , ఒక ఎస్సై, ఒక ఏఆర్‌ఎస్సై, పది మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో జరిగే అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలపాలపై ఈ టీం ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రజలతో కలిసిపోతూ సమాచారం సేకరిస్తోంది. యూనిఫాం లేకుండా సివిల్ డ్రెస్సుల్లోనే అక్రమ వ్యాపారాలు, కల్తీ, వ్యభిచారం, పేకాట స్థావరాలు, గుట్కా, గంజాయి రవాణా, ప్రజాపంపిణీ బియ్యం అక్రమరవాణాపై దృష్టి పెట్టి ఆధారాలతో సీపీకి సమాచారమందించి దాడులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం టీంలో సీఐలు ఆర్.ప్రకాశ్, కె.శశిధర్‌రెడ్డి, ఎస్సై వంశీకృష్ణ ఉన్నారు.
ఎక్కువ శాతం నిషేధిత గంజాయి వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కరీంనగర్ మీదుగానే వెళ్తోంది. సీపీ కమలాసన్‌రెడ్డి సూచనల మేరకూ కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ వివిధ సాంకేతిక పరిజ్ఞానం, పట్టిష్టమైన ప్రజాసంబంధాలు ఉండడంతో ముందుగానే అక్రమ రవాణా గురించి తెలుసుకొని చాకచక్యంగా దాడులు చేసి అక్రమార్కులను అరెస్టులు చేస్తున్నారు. వరుసగా దాడులు చేస్తూ పట్టుకోవడంతో అక్రమార్కులు కరీంనగర్ నుంచి తమ వాహనాలు వెళ్లాలంటేనే భయపడేలా టాస్క్‌ఫోర్స్ విభాగం పనిచేస్తోంది. కొన్ని కేసుల్లో అత్య«ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసాంఘిక కార్యకాలపాలనూ ఎప్పుటికప్పుడు కట్టడి చేస్తున్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా చోరీలకు అడ్డుకట్ట వేయడంతోపాటు, దొంగలను కటకటాలపాలు చేస్తున్నారు.
మెరుపుదాడులు....
టాస్క్‌ఫోర్స్ టీం కమిషనరేట్ పరిధిలో వివిధ అక్రమాలపై మెరుపుదాడులు నిర్వహించి అక్రమార్కులను కటకటాలాపాలు చేస్తోంది. సెల్‌టవర్ ఏర్పాటు చేస్తామని కరీంనగర్‌కు చెందిన లైన్‌మెన్‌ను నమ్మించి అంతరరాష్ట్ర ముఠా రూ.17 లక్షలు వసూలు చేసింది. ఈ మోసాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు ఢిల్లీకి వెళ్లి అక్కడే మకాం వేసి ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. కరీంనగర్ మీదుగా తరలుతున్న గంజాయిని పట్టుకుని ఐదు కేసుల్లో 12 మందిని అరెస్టు చేసి రూ.కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పేకాటా ఆడుతున్న 40 కేసుల్లో 231 మందిని ఆరెస్టు చేసి సుమారు రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత గుట్కాపై 44 కేసులు నమోదు చేసి 88 మందిని అరెస్టు చేసి రూ.4.5 కోట్ల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్ మీదుగా అక్రమంగా తరలిస్తున్న ప్రజాపంపిణీ బియ్యాన్ని సరఫరా చేస్తుండగా 29 కేసుల్లో 33 మందిని ఆరెస్టు చేసి రూ.19 లక్షల విలువ చేసే 1,500 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. మట్కా కేసులో 12 మందిని అరెస్టు చేసి రూ.75 వేలు పట్టుకున్నారు. నకిలీ విత్తనాలకు సంబంధించిన 2 కేసుల్లో ఏడు గురిని అరెస్టు చేసి రూ.85 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన 13 కేసుల్లో 16 మందిని అరెస్టు చేశారు. ఈ విధంగా అక్రమాలు చేస్తున్న వారిని కటకటాలపాలు చేస్తున్నారు.
నిరంతర నిఘా..
కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పనితీరులో బాగుంది.. కల్తీ దందా చేసేవారు, గంజాయి, నిషేధిత గుట్కా రవాణా చేసే వారిపై నిరంతర నిఘా ఉంటుంది. దాడుల్లో పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు తమ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారమందిస్తే వెంటనే దాడులు చేసి పట్టుకుంటాం.
–వీబీ.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీసు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment