సాగు యజ్ఞం.. కరువుపై యుద్ధం చేద్దాం
వ్యవసాయాన్ని పండుగ చేద్దాం: అధికారులకు సీఎం కేసీఆర్ పిలుపు
- 55 లక్షల మంది రైతుల బతుకులను బాగుచేద్దాం
- ఒక్కో వ్యవసాయాధికారి ఒక్కో కేసీఆర్ కావాలి
- రైతు పెట్టుబడి పథకానికి వచ్చే బడ్జెట్లో రూ.7,500 కోట్లు కేటాయిస్తాం
- మరో 500 ఏఈవో పోస్టులు భర్తీ చేస్తాం
- ఏఈవోలకు త్వరలో ల్యాప్‌టాప్‌లు ఇస్తాం
- వచ్చే జూన్ 10 నాటికి రైతుల వివరాలన్నీ సేకరించాలి
సాక్షి, హైదరాబాద్: ‘‘వ్యవసాయం ఛిన్నాభిన్నమైంది.. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. ఆ పరిస్థితి పోవాలి. వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేద్దాం. 55.49 లక్షల మంది రైతుల బతుకులు బాగుచేద్దాం. దరిద్రం, కరువు కాటకాలపై యుద్ధం చేద్దాం. ఒక్కో వ్యవసాయాధికారి ఒక్కో కేసీఆర్ కావాలి..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ యజ్ఞం మొదలైందని ప్రకటించారు.
‘రైతుహిత’ పేరిట మంగళవారమిక్కడ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వ్యవసాయాధికారులు ఈలలు, చప్పట్లతో సీఎం ప్రసంగంపై అడుగడుగునా హర్షం వ్యక్తంచేశారు. రైతుకు పెట్టుబడి ఖర్చు కింద ఆర్థికసాయం చేసేందుకు వచ్చే బడ్జెట్లో రూ.7 వేల నుంచి రూ.7,500 కోట్లు కేటాయిస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ప్రతి రైతుకు వానాకాలంలో మే 15 నాటికి, యాసంగిలో అక్టోబర్ నాటికి ఎకరానికి రూ.4 వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. వచ్చే జూన్ 10వ తేదీ నాటికి వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవోలు) తమ పరిధిలోని 5 వేల ఎకరాలపై సమగ్ర విశ్లేషణ చేయాలన్నారు.
‘‘ఎంత భూమి ఉంది? ప్రాజెక్టులు, రోడ్లు, కాలువలు, పరిశ్రమలు, కంపెనీలు, రియల్ ఎస్టేట్ కింద ఇతరత్రా అవసరాలకు ఏమైనా పోయిందా? ఈ అంశాలన్నింటినీ పరిశీలించి నికరంగా సాగు భూమి నిర్ధారణ చేయాలి. ఒక్కో రైతు పేరిట ఎంత భూమి ఉంది? సర్వే నంబర్, ఇంటి నంబర్, సెల్ నంబర్ తప్పనిసరిగా సేకరించాలి. ఈ సమగ్ర సమాచారం సేకరించి నాకు పంపాలి. మొత్తం ఆన్‌లైన్ చేయాలి. అలాగే ట్రాక్టర్లు, కల్టివేటర్లు, రోటావేటర్లు, నాటు యంత్రాల సమాచారం కూడా సేకరించాలి. వడగళ్ల వానలు ఎక్కువగా కురిసే ప్రాంతాలను కూడా గుర్తించి... ఆ సమయానికి ముందు పండే పంటలు వేసేలా చూడాలి. సూక్ష్మసేద్యం కింద ఎంత భూమి ఉందో గుర్తించాలి’’అని సీఎం ఆదేశించారు.
రైతుసంఘం పంపిన జాబితాకే డబ్బులు
ఏఈవోలు గ్రామరైతు సంఘాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. గ్రామ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులతో కలిపి మండల రైతు సమాఖ్య ఏర్పాటు కావాలని, వాటి అధ్యక్ష కార్యదర్శులతో కలిపి జిల్లా రైతు సమాఖ్య, అలాగే రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు కావాలని పేర్కొన్నారు. రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు సీఎం అంత పవర్‌పుల్‌గా ఉండాలన్నారు. ‘‘వచ్చే ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర రైతు సమాఖ్యకు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌గా ఇది ఉంటుంది.
రైతు పండించిన పంటకు సరైన ధర కోసం వ్యాపారులతో మండల లేదా జిల్లా రైతు సమాఖ్య చర్చిస్తుంది. తేమ శాతాన్ని కూడా సమాఖ్యే నిర్ధారిస్తుంది. సరైన ధర ఇస్తే సరేసరి లేకుంటే ధాన్యాన్ని బియ్యం పట్టించి పక్క రాష్ట్రాలకు సమాఖ్యే అమ్ముతుంది. అప్పుడు దళారుల తిక్క కుదురుతుంది. రూ.4 వేల సాయం పొందే రైతుల జాబితాను ఏఈవో, గ్రామ రైతుసంఘమే గుర్తించాలి. వారు పంపిన జాబితాకే డబ్బులు పంపిస్తాం.
రూ.4 వేలల్లో రూ.2,200 లేదా రూ.2,300కు ఎరువులు వస్తాయి. మిగిలిన వాటితో విత్తనాలు, పెస్టిసైడ్స్, కూలీకి కూడా సరిపోతాయి. రైతు సంఘాలు ఏర్పడ్డాక వారందరినీ హైదరాబాద్ పిలుస్తా. లేకుంటే నేనే కొన్ని జిల్లాలకు వచ్చి సమావేశం ఏర్పాటు చేస్తా. 5 వేల ఎకరాల ఏఈవో క్లస్టర్‌లో అందరికీ అందుబాటులో ఉండే ఒక గ్రామాన్ని గుర్తించాలి.
మూడు, నాలుగొందల మంది రైతులు కూర్చొనేలా ఆ గ్రామంలో ఈ ఏడాదే షెడ్డు నిర్మిస్తాం. పక్కనే గోదాం నిర్మిస్తాం. ప్రతీ ఏఈవో పరిధిలో మినీ లేబొరేటరీలు ఏర్పాటు చేస్తాం. వాటిల్లో భూసార పరీక్షలు నిర్వహించాలి. వచ్చే ఏడాది నాటికి భూసార పరీక్షలు పూర్తి చేసి కంప్యూటరైజ్ చేయాలి. అన్నీ సిద్ధం చేసి వచ్చే జూన్ నుంచి యుద్ధం మొదలు పెట్టాలి’’అని అన్నారు. సరళమైన భాషలోనే రైతులతో మాట్లాడాలని సూచించారు.
వ్యవసాయాధికారులకు ల్యాప్‌టాప్‌లు
రాష్ట్రంలోని 3,500 మంది వ్యవసాయాధికారులకు 10–15 రోజుల్లో ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏఈవోలు మోటార్ సైకిల్ కొనుగోలు చేసుకునేందుకు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. అధికారులకు వాహన భత్యం పెంచుతామని, మరో 500 మంది ఏఈవో పోస్టులు నెల రోజుల్లో భర్తీ చేస్తామని వెల్లడించారు. ‘‘300 మంది వ్యవసాయాధికారులను ఇజ్రాయెల్ పంపిస్తాం. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు, కమిషనర్ పద్ధతి మార్చుకోవాలి.
పర్యవేక్షించడమే కాకుండా క్షేత్రస్థాయి ఉద్యోగులతో సమాచారం తెప్పించుకోవాలి. వ్యవసాయ వర్సిటీలో ఉత్పాదకతపై పరిశోధనలు జరగాలి. మొత్తం 330 గోదాములకుగాను 310 పూర్తయ్యాయి. అవగాహన లేని ఆర్థికవేత్తలు వ్యవసాయం దండుగ అంటున్నారు. కానీ ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వ్యవసాయమే. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వెయ్యి ఎకరాల్లో గ్రీన్‌హౌస్ సాగుపై ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు’’అని అన్నారు.
గొర్రెల పెంపకంతో సేంద్రీయ తెలంగాణ
మాంసం కోసం హైదరాబాద్‌కు ప్రతిరోజూ 350 లారీల గొర్రెలను దిగుమతి చేసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. ‘‘రాష్ట్రంలో 30 లక్షల మంది యాదవులుంటే గొర్రెలు దిగుమతి చేసుకోవడమేంటి? మేం గొర్రెల పంపిణీ చేపట్టి రూ.20 వేల కోట్ల సంపద సృష్టిస్తాం. గొర్రెల పెంపకంతో సేంద్రీయ తెలంగాణ సాధ్యం కానుంది. లక్షల టన్నుల ఎరువు వస్తుంది.
దీంతో రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. రైతులను, యాదవులను కలపాలి. నేను కూడా చిన్నప్పుడు తోడేలు రాకుండా గొర్రెల మంద దగ్గర కాపలాగా పడుకున్నా. నా గ్రీన్‌హౌస్‌లో ఇంగ్లిషు కుకుంబర్ వేస్తే 60 టన్నులు పండింది. ఫెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గించాలి. వ్యవసాయ యాంత్రీకరణ జరగాలి’’అని అన్నారు.
11 రాష్ట్రాల సీఎంలు ప్రశంసించారు
రైతుకు పెట్టుబడి సాయంపై నీతి ఆయోగ్ సమావేశంలో 11 మంది సీఎంలు ప్రశంసించారని కేసీఆర్ తెలిపారు. ఇండియా టుడే సంచలనాత్మక నిర్ణయంగా అభివర్ణించిందన్నారు. ప్రధాని కూడా రూ.4 వేల సాయంపై తనతో చర్చించారన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి వృద్ధి రేటు 21 శాతంగా ఉందని, దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నామని చెప్పారు. ప్రతీ ఏడాది ఎంత లేదనుకున్నా 15 శాతం వృద్ధి రేటు ఉంటుందని ఆర్థికవేత్తలు తేల్చారన్నారు. అలా రూ.15–16 వేల కోట్ల వరకు నికరంగా ఖజానాలో ఉంటుందని, అందుకే రైతులకు పెట్టుబడి సాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
నాకు ఎవరితోనూ కొట్లాట లేదు..
‘‘నా వయసు ఇప్పుడు 64. తెలంగాణ కావాలని అనుకున్నా.. వచ్చింది. ఇప్పుడు బంగారు తెలంగాణ కావాలి. నాకు ఎవరితోనూ పంచాయితీ లేదు.. కొట్లాట లేదు.. బతికున్న ఈ మిగిలిన కాలంలో తెలంగాణ పచ్చగా కళకళలాడుతుంటే, దుఃఖం లేని రైతు చిరునవ్వుతో ఉంటే చూడాలన్న కాంక్ష తప్పితే నాకు మరో ఆకాంక్ష లేదు. దయచేసి మీరు నా ఆకాంక్ష నెరవేర్చుతారని భావిస్తున్నా..’’సీఎం ఉద్వేగంగా అన్నారు. ప్రతిపక్షాలు ప్రతీ దానికి రాజకీయం చేస్తున్నాయన్నారు.
‘‘ఓట్లు, రాజకీయాలు అంటూ చిల్లర గొడవ చేస్తున్నారు. గెలిపిస్తే పనిచేయాలి... లేకుంటే ఇంట్లో పడుకోవాలి. అడుగేస్తే రాజకీయమేనా..?’’అని మండిపడ్డారు. ‘‘నేను యాదృచ్ఛికంగా సీఎంగా ఉండొచ్చు. నేను కాకపోతే ఎల్లయ్యో పుల్లయ్యో ఉంటాడు. అదేం విశేషం కాదు...’’అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించారు.