ఎలాగైనా గెలవాల్సిందే...! | kcr Decide To Won Many Number Of Seats | Sakshi
Sakshi News home page

ఎలాగైనా గెలవాల్సిందే...!

Published Tue, Nov 13 2018 1:57 PM | Last Updated on Wed, Mar 6 2019 6:18 PM

kcr Decide To Won Many Number Of Seats - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై టీఆర్‌ఎస్‌ గురిపెట్టింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ పక్కా ప్రణాళిక రచిస్తున్నారు. వివిధ సర్వేలు, అంతర్గత నివేదికల సమాచారాన్ని తెప్పించుకుని ఎప్పటికప్పుడు అభ్యర్థుల ప్రచార సరళి, ప్రజల నుంచి వస్తున్న స్పందనను పరిశీలిస్తూ గెలుపోటములను అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిలాలో కాస్త ఇబ్బందికరంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

పార్టీకి ఇబ్బందికరంగా ఉన్న స్థానాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు టీఆర్‌ఎస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపారు. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, కొడంగల్, మక్తల్, మహబూబ్‌నగర్‌ స్థానాలకు మంత్రి హరీశ్‌రావును ఇన్‌చార్జిగా వేశారు. ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.  


గతంలో కంటే ఎక్కవ స్థానాలపై.. 
రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన పాలమూరు జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటే మ్యాజిక్‌ ఫిగర్‌ చేరుకోవడం అత్యంత సులువని అన్ని రాజకీయపార్టీలు భావిస్తాయి. అందులో భాగంగా ఉమ్మడి పాలమూరులోని 14 అసెంబ్లీ స్థానాలకు మెజారిటీ సీట్లు గెలుపొందేందుకు టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. దక్షిణ తెలంగాణలో.. అందులోనూ పాలమూరు ప్రాంతం కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉందనే సర్వే నివేదికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల కంటే అదనంగా అసెంబ్లీ స్థానాలు గెలుపొందాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. గత ఎన్నికల్లో 14 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ ఏడు చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఈసారి అదనంగా మరో నాలుగైదు సీట్లు గెలవాలని కృతనిశ్చయంతో ఉంది. 


ఇన్‌చార్జిగా హరీశ్‌రావు 
పాలమూరు ప్రాంతంపై మంచి పట్టు ఉన్న మంత్రి హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. సాగునీటి శాఖ మంత్రిగా హరీశ్‌రావు ప్రతీ నెల జిల్లాలో పర్యటిస్తూ.. ప్రజల నాడిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పాలమూరు నుంచి అత్యధిక సీట్లు గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ దళపతి.. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా నాలుగు స్థానాల విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉందని ఆయన గుర్తించినట్లు సమాచారం. అందులో భాగంగా గద్వాల, కొడంగల్, మక్తల్, మహబూబ్‌నగర్‌ స్థానాలకు ఇన్‌చార్జిగా మంత్రి హరీశ్‌రావును నియమించారు.

వీటిలో రెండు స్థానాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, మరో రెండు స్థానాలు స్వపక్షానికి చెందిన నేతలు ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా ప్రతిపక్షానికి చెందిన డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల, ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో ఎట్టి పరిస్థితిలో గులాబీ జెండా ఎగురాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అయితే స్థానిక నేతలకు అండగా ఉండేలా ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో సిద్ధహస్తుడైన హరీశ్‌రావును రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలో ఇది వరకే కొడంగల్‌ నియోజకవర్గ పరిస్థితులపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా స్టడీ చేసినట్లు చేసినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తూ పార్టీకి అనుకూలంగా మార్చేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. 


స్వపక్ష నేతలకు మద్దతుగా.. 
బలమైన విపక్షనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటు.. స్వపక్షానికి చెందిన నేతలు ప్రాతినిధ్యం వహించిన రెండు స్థానాలకు కూడా హరీశ్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. మక్తల్‌లో పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి నియోజకవర్గంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

  సొంత పార్టీ నేతలే వేరు కుంపటి పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో అక్కడ సమస్యను పరిష్కరించేందుకు జిల్లాకు చెందిన ముఖ్యులకు బాధ్యతలు అప్పగించినా ఫలితం కానరాలేదు. దీంతో స్వయంగా మంత్రి హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించి... మక్తల్‌లో పార్టీ అభ్యర్థి గెలుపొందేలా చూడాలని కేసీఆర్‌ సూచించినట్లు సమాచారం. అలాగే అతి కీలకమైన మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానాన్ని కూడా టీఆర్‌ఎస్‌ గెలిచి తీరాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించాలని హరీశ్‌కు సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement