ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సిద్దిపేట: గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి ఆదివారం బీ ఫారం అందుకున్న జిల్లా టీఆర్‌ఎస్ అభ్యర్థులు బుధవారం రోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తోపాటు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వే ల్, దుబ్బాక, జనగామ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, వొడితల సతీష్‌కుమార్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో సరిగ్గా కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలుకు ముందుగా తల్లిదండ్రులను, ఇష్ట దైవాలను కొలుచుకొని, పూజలు నిర్వహించి హంగూ ఆర్భాటం లేకుండా నామినేషన్ కేంద్రాలకు వెళ్లనున్నారు.
కోనాయిపల్లిలో కేసీఆర్, హరీశ్‌రావు పూజలు
సెంటిమెంట్లకు, జాతకాలు, ముహూర్తాలకు ప్రాధాన్యత ఇచ్చే సీఎం కేసీఆర్.. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా తన ఇష్టదైవం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ముందుగా కేసీఆర్ బీ ఫారంపై సంతకం పెడతారు. అనంతరం దానికి పూజారులు గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేరుగా నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. బుధవారం కోనాయిపల్లికి సీఎం కేసీఆర్‌తోపాటు, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా వెళ్లి తన బీ ఫారంకు పూజలు చేయిస్తారు. హరీశ్‌రావు మందుగా హైదరాబాద్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆశీర్వచనాలు తీసుకొని, ఆ తర్వాత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుంటారని ఆయన ఆనుచరులు చెబుతున్నారు.
అనంతరం కోనాయిపల్లిలో పూజలు చేయించిన బీ ఫారం తీసుకొని నేరుగా సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అక్కడ అర్చకులు, పూజారులు, హిందూ మత పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అక్కడి నుండి గద్దెబొమ్మ సమీపంలోని పెద్ద మసీద్‌లోకి వెళ్లి హరీశ్‌రావు ప్రార్థనలు నిర్వహిస్తారు. ముస్లీం పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆ తర్వాత నేరుగా చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయిస్తారు. అక్కడ క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఇలా సర్వమత ప్రార్థనలు చేసిన తర్వాత సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు.
ఇంటి దైవాన్ని కొలిచిన తర్వాత సతీష్ నామినేషన్
హుస్నాబాద్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి వొడితల సతీష్‌కుమార్ తన ఇంటి దైవం వెంకటేశ్వర స్వామిని కొలిచిన తర్వాత నామినేషన్ వేస్తారు. ముందుగా తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కుటుంబ సభ్యులతో కలిసి సొంత గ్రామమైన హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో వీరి పూర్వీకులు నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుండి హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి అట్నుంచి నేరుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి సతీష్‌కుమార్ నామినేషన్ వేయనున్నారు.
సాదాసీదాగా సోలిపేట నామినేషన్
ఎప్పటి మాదిరిగానే దుబ్బాక నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి సాదాసీదాగా బుధవారం నామినేషన్ వేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. బుధవారం మంచిరోజు ఉన్నదని అధినేత కేసీఆర్ చెప్పిన నేథప్యంలో అందరితోపాటు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూడవెల్లి ఆలయంలో పూజల అనంతరం ముఖ్య అనుచరులతో బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అధికారికి అందజేస్తారు.
ఎల్లమ్మను మొక్కి ముత్తిరెడ్డి నామినేషన్
జనగామ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇష్ట దైవం ఎల్లమ్మ తల్లిని మొక్కి బుధవారం నామినేషన్ వేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జనగామ నియోజకవర్గంలోని జనగామ మండలం యశ్వంతాపూర్ ఎల్లమ్మ తల్లి అంటే యాదగిరిరెడ్డికి భక్తి ఎక్కువ. అందుకే ఏ కార్యక్రమం చేయాలన్నా అక్కడ పూజలు నిర్వహించి పనిమొదలు పెట్టడం ఆనవాయితీ. అందులో భాగంగా బుధవారం ఉదయం యాదగిరిరెడ్డి కుటుంబసమేతంగా ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. బీఫారం అక్కడ పెట్టి తల్లి దీవెనలు కోరుతారు. అక్కడి నుంచి జనగామ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు అధికారులకు అందచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment