సాక్షి, మంచిర్యాల : జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో రాత్రి బస చేసి న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య ప రోక్షంగా వైద్యులకే మద్దతు తెలిపారు. అవినీతిమయమైన మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో ఇటీవల ప్రసవం చేసేందుకు లంచం అడిగి శిశువు మృతికి కారణమైన వైద్యురాలిపై విచారణకు ఆదేశించి చేతులు దులుపుకున్నారు. ఆస్పత్రిలో పడకేసిన వైద్యం గురించి మంగళవారం పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లినా.. ఆస్పత్రిలో వైద్యం అందుతున్న తీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
బుధవారం ఆస్పత్రి నుంచి బయల్దేరే ముందు విలేకరులతో మాట్లాడారు. పారిశుధ్యం.. సెక్యూరిటీ.. పలు విభాగాల నిర్వహణపై ప్రసంశల జల్లు కురిపించారు. హైదరాబాద్ తర్వాత ఇక్కడే మూడు వేల యూనిట్ల బ్లడ్ స్టోరేజీ సౌకర్యం ఉండడం విశేషమన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది రూ.100, రూ.200 అడిగితే అది తప్పు కాదన్నారు. సమయపాలన పాటించాలని వైద్యులను సున్నితంగా మందలించారు.
చికిత్స పేరిట రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు.. తప్పుడు రిపోర్టులు ఇస్తున్న వ్యాధి నిర్ధారణ కేంద్రాలు.. అనుమతి లేని ఆస్పత్రులపై చర్యల విషయాన్ని మంత్రి ప్రస్తావించలేదు. ‘ప్రైవేట్’ దోపిడి గురించి మీడియా మంత్రి వివరణ కోరగా.. డీఎంహెచ్‌వోల ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రూ. 3.15 కోట్లతో అభివృద్ధి పనులు..
జిల్లావ్యాప్తంగా అన్ని ఏరియా, సామాజిక ఆస్పత్రులు, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.3.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి రాజయ్య తెలిపారు. జైపూర్‌లో రూ.40 లక్షలు, ఇచ్చోడలో రూ.55 లక్షలు, గుడిహత్నూర్‌లో రూ.50 లక్షలు, ఆదిలాబాద్‌లోని భీంపూర్, తిర్యాణిలో రూ.40 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నట్లు వివరించారు.
రూ.11 కోట్లతో ఆసిఫాబాద్ ఏరియా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి వెంట.. మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, వైద్యారోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్ నాగేశ్వరరావు, కలెక్టర్ జగన్మోహన్, డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, ఆర్డీవో ఆయేషా మస్రత్‌ఖానం ఉన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు..
మంచిర్యాల టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో వైద్యులు కానీ సిబ్బంది కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని ఉప ముఖ్యమంత్రి రాజయ్య హెచ్చరించారు. రాత్రి సమీక్ష సమావేశంతోపాటు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేస్తామన్నారు. వైద్య శాఖలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిపి అవినీతికి స్థానం లేకుండా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రాత్రి సమీక్ష సమావేశం అనంతరం ఒంటి గంటకు భోజనం పూర్తి చేసి ఆస్పత్రిలో మరోసారి పర్యవేక్షణ జరిపారు.
నైట్ డ్రెస్ ధరించి ఆస్పత్రి ఆవరణలో కలియతిరిగారు. తాను వచ్చింది నిద్రావస్థలో ఉన్న వైద్య వ్యవస్థను మేల్కొల్పడానికని అందుకే తాను నిద్రపోను.. ఎవ్వరినీ నిద్ర పోనివ్వను అంటూ స్పష్టం చేశారు. దాదాపు గంటపాటు ఆస్పత్రిలో రోగులను పరిశీలిస్తూ.. పరీక్షిస్తూ వార్డులో తిరిగారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో తనకు కేటాయించిన ప్రత్యేక గదికి వెళ్లారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో గది నుంచి బయటకు వచ్చారు.
ఆ సమయంలోనే ఆస్పత్రిలోని సిబ్బంది క్వార్టర్స్‌ను పరిశీలించారు. 6.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో మార్చురీ వైపు ఖాళీ ప్రదేశంలో మామిడి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, కలెక్టర్ ఎం.జగన్‌మోహన్, ఆర్డీవో అయేషా మస్రత్ ఖానమ్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రుక్మిణమ్మ, మంచిర్యాల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఐఎంఏ ఆధ్వర్యంలో సన్మానం...
ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాతమంచిర్యాలలోని ఐఎంఏ భవన్‌లో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సాల్మన్‌రాజ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిప్రసాద్, సీనియర్ వైద్యులు ఎన్.మల్లేశ్, ఫణికుమార్, రమణ, ఉదయ్‌కుమార్, అన్నపూర్ణ, సమత, జయలలిత, సుమబిందు, డ్రగ్గిస్ట్, కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులు మోటూరి చంద్రశేఖర్, తొగరు సుధాకర్, రావుల రాజశేఖర్ పాల్గొన్నారు.
వైద్యుల పక్షమే..!
Published Thu, Jan 8 2015 3:50 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement