గజ్వేల్ లో గట్టెక్కిన గులాబీ బాస్!
తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావుకు మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో విజయం సునాయాసంగా దక్కలేదు. రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో అత్యంత ఉత్యంఠ రేపిన గజ్వేల్ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్ధి, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ప్రతాపరెడ్డిపై 19218 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కేసీఆర్, ప్రతాప్ రెడ్డిల మధ్య విజయం దోబూచలాడింది. ఓ దశలో నువ్వా నేనా అనే రీతిలో ఆసక్తిని కలిగించింది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్రను పోషించిన కేసీఆర్ కు ప్రతాపరెడ్డి గట్టిపోటినే ఇచ్చారు. తెలంగాణ తెచ్చింది... ఇచ్చింది మేమే అంటూ క్రెడిట్ ను కొట్టేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరపున టి. నర్సారెడ్డిని సైతం ప్రతాప్ రెడ్డి వెనక్కినెట్టడం చర్చనీయాంశమైంది. ఎన్నికల ఫలితాలకు ముందే గజ్వేల్ కేసీఆర్ కు ఓటమి తప్పదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తోపాటు, పలు రాజకీయపార్టీల నేతలు జోరుగా ప్రచారం చేశారు.
ప్రత్యర్ధుల ప్రచారానికి తోడు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేసీఆర్ కు ప్రతాప్ రెడ్డి ఎదురొడ్డి పోరాడారు. ప్రతాపరెడ్డి ఓటమిపాలైనా.. కేసీఆర్ కు ధీటుగా నిలిచి.. రెండు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించారు. గజ్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్ 19218 ఓట్ల తేడాతో విజయం సాధించడం పక్కనపెడితే.. కేసీఆర్ కు ఊహించని రితీలో గట్టిపోటిని ఇచ్చారు. జిల్లాలో ఇతర టీఆర్ఎస్ నేతలు భారీ మెజార్టీని చేజిక్కించకుంటే.. కేసీఆర్ స్వల్ప మెజారిటీని సాధించారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ సుమారు 4 లక్షల ఓట్ల మెజార్టీ సాధించారు. అయితే గజ్వేల్ లో మాత్రం భారీ మెజార్టీని సాదించలేకపోయారు.
అసెంబ్లీ ఫలితాలకు ముందే గజ్వేల్ మున్సిపాలిటి, జెడ్పీటీసీని తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. కాని టీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ గెలుపుపై ఆరంభం నుంచి ధీమాగానే ఉంది. కేసీఆర్ విజయానికి సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు అన్ని తానై వ్యవహరించారు. గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడంతో ఓదశాబ్ద కాలం తర్వాత కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2004లో కరీంనగర్, 2009 మహబూబ్ నగర్ పార్లమెంటరీ స్థానం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే.
-
70వ దశకంలో సంజయ్ గాంధీ నేతృత్వంలోని యూత్ కాంగ్రెస్ లో చేరడం ద్వారా తన రాజకీయ కెరీర్ ను అరంభించారు.
-
1977లో ఇందిరాగాంధీ క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో జిల్లా కాంగ్రెస్ నేతలతోపాటు కేసీఆర్ మద్దతుగా నిలిచారు.
-
1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన కేసీఆర్ కాంగ్రెస్ నేత ఏ.మదన్ మోహన్ చేతిలో పరాజయం పాలయ్యారు.
-
1985 నుంచి 2004 వరకు సిద్దిపేట ఎమ్మెల్యేగా, 2004లో కరీంనగర్, 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికయ్యారు.
-
2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించారు.
-
2004లో యూపీఏ-1 ప్రభుత్వంలో కొంతకాలం కేంద్రమంత్రిగా సేవలందించారు.