మెదక్ జిల్లా : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి దమ్మున్న మగాడు అని సిద్దిపేట జిల్లా టీడీపీ అధ్యక్షుడు బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం తూప్రాన్‌లో డీఎన్‌ఆర్‌కేఎస్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లిన రేవంత్‌రెడ్డిని దమ్మున్న మగాడిగా ఆయన అభివర్ణించారు.
ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన నాయకులను టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్య అని ఆయన అన్నారు. ఇలాంటి దిగజారుడు తనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్పడడం శోచనీయమన్నారు. మగాళ్ళైతే ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన నాయకులు రాజీనామాలు చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని ఘాటుగా సవాల్ విసిరారు. మూడున్నర ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి కార్మికుడికి రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతోపాటు 55సంవత్సరాలు దాటిన వారికి రూ. 5వేల పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్‌యాదవ్, భవన నిర్మాణరంగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెలిమెల రాములు, కార్మిక సంఘం నాయకులు రఘుపతి, సత్తయ్య, శ్రీనివాస్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment