మెదక్: ‘‘కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి...దిమాక్ మోకాల్లోకి వచ్చింది. రజాకార్ల పార్టీ మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారారు. కరెంట్ కోసం రోడ్డెక్కితే...రైతులను లాఠీ లతో కొట్టిస్తున్నారు. యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేపడితే...తిన్నదరగక ఉద్యమాలు చేస్తున్నారంటూ వెక్కిరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని గెలిపించి కేసీఆర్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వండి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
గురువారం మెదక్‌లో నిర్వహించిన బీజేపీ, టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించా రు. టీఆర్‌ఎస్ వంద రోజుల పాలనలో 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాసాయిపేట రైలు ప్రమాదంలో 18 మంది చిన్నారులు మరణించినా...ముఖ్యమంత్రికి పరామర్శించే సమయం లేకుండా పోయిందన్నారు. సమగ్ర సర్వే పేరుతో అర్హులైన వేలాది మంది లబ్ధిదారులను రోడ్డు పాలు చేస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్‌కు భయపడి అభివృద్ధి నిధుల కోసం ప్రధానమంత్రి మోడిని కలవడం లేదన్నారు.
మాటలు మార్చే కేసీఆర్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక దింపుడు కల్లం కాడున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే అది మురిగిపోతుందన్నారు. అనంతరం టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తే నెల రోజుల్లో రైతులకు నిరంతరంగా 8 గంటల విద్యుత్‌ను అందిస్తామన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్, పూటకో మాట మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
గెలిపించండి..మంజీరా పారిస్తా
ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే రూ.200 కోట్లతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మంజీరా నీరు అందిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలను నియోజకవర్గ ప్రజలు ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. కేసీఆర్‌వి మాట లెక్కువ...పని తక్కువ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని బీజేపీ, టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో టీడీపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, యెండల లక్ష్మినారాయణ, ఎ.కె.గంగాధర్, బట్టి జగపతి, డాక్టర్ సురేందర్, డాక్టర్ మురళీధర్‌గౌడ్, శశికళ యాదవరెడ్డి, కె.సత్యనారాయణ, మనోహర్‌రెడ్డి, గడ్డం శ్రీనివాస్, లక్ష్మినర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి
Published Thu, Sep 4 2014 11:00 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement