శాఖలు అటూఇటూ! | kcr mulls to change portfolios in cabinet | Sakshi
Sakshi News home page

శాఖలు అటూఇటూ!

Published Wed, Aug 27 2014 1:33 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

శాఖలు అటూఇటూ! - Sakshi

శాఖలు అటూఇటూ!

 మంత్రుల శాఖలు మార్పు.. పలువురి పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి
 
 సాక్షి, హైదరాబాద్, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్‌లో పలువురి శాఖలు మార్చాలని యోచిస్తున్నారు. ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్న కొందరు మంత్రుల పనితీరుపై ఆయన అసంతృప్తిగా ఉండటమే ఇందుకు కారణమని విశ్వసనీయంగా తెలుస్తోంది. మెదక్ లోక్‌సభకు ఉప ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు వంటివి పూర్తయిన తర్వాత దసరా పండుగకు అటూఇటుగా శాఖల మార్పుతో పాటు మంత్రివర్గ విస్తరణకు సీఎం శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గం ఏర్పాటై మూడు నెలలు (సెప్టెంబర్ 2న) కావస్తోంది. అయినప్పటికీ మెజారిటీ మంత్రులకు తమ శాఖలపై కనీస అవగాహన రాలేదని కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. మరికొందరు మంత్రుల పేషీలు వ్యవహరిస్తున్న తీరు, వారి చాంబర్లలో నడుస్తున్న అపసవ్య ధోరణులు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయి. కాంగ్రెస్ మంత్రుల హయాంలో చక్రం తిప్పిన వారే ఇప్పుడు టీఆర్‌ఎస్ మంత్రుల దగ్గర కూడా అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. గత మంత్రుల దగ్గర పనిచేసిన వారిని మళ్లీ ఓఎస్‌డీలు, పీఎస్‌లుగా తీసుకోవద్దని కేసీఆర్ ఆదిలోనే గట్టి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారిని అధికారికంగా తీసుకోనప్పటికీ కొందరు మంత్రుల దగ్గర వారు ఆంతరంగికులుగా, సన్నిహితులుగా చలామణి అవుతున్నారు. బదిలీలు, ఇతర ముఖ్యమైన వ్యవహారాల్లో వారే చక్రం తిప్పుతున్నట్లు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు.

ఇక కొందరు మంత్రుల పేషీల్లో ఉన్న వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్‌డీలు సర్వం తామే అన్నట్టుగా వ్యవహరిస్తూ... సందర్శకుల పట్ల నిర్లక్ష్యంగా, అమర్యాదగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆయనకు ఫిర్యాదులు అందాయి. ఒకరిద్దరు మంత్రులైతే సచివాలయంలోని చాంబర్‌లో కూర్చుంటున్నప్పటికీ శాఖా పరమైన ఏ పనినీ పట్టించుకోవడం లేదని కూడా సీఎం దృష్టికి వెళ్లింది. వారికిప్పటికీ శాఖాపరమైన కనీస అవగాహన కూడా రాకపోవడం, కనీసం దాని అధ్యయనంపైనా దృష్టి కేంద్రీకరించకపోవడంపై కేసీఆర్ బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కీలక  పోర్టుఫోలియోను నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మంత్రి ఒకరిని తక్షణమే మార్చాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. అయితే మంత్రులు కూడా సీఎం తీరుపై ఒకింత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘మంత్రివర్గంలో ఉన్నామనే పేరు తప్ప చిన్న చిన్న బదిలీలకు కూడా సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావాల్సిందే. ప్రతీ చిన్న విషయంపైనా సీఎంకే నివేదిక పోతున్నది. మంత్రులుగా ఉన్నా మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు’ అని కొందరు మంత్రులు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేయడం కొసమెరుపు.
 
 చంద్రబాబుపై అసంతృప్తే కారణం..
 
 టీడీపీకి మొదటి నుంచీ అండగా ఉండి, ఖమ్మం జిల్లాను ఆ పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దిన తుమ్మల.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఉన్న అసంతృప్తి వల్లే పార్టీని వీడుతున్నారని ఆయన సన్నిహితులంటున్నారు. జిల్లాలో ఆయనకు ప్రాధాన్యం తగ్గించి, తన వ్యక్తిగత కోటరీలోని సభ్యుడైన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాటకే బాబు విలువనిస్తున్నారని వారు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపులో కూడా నామాకే బాబు ప్రాధాన్యమిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తుమ్మల అనుచరుడు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి రాత్రికి రాత్రే మార్చేశారని, ఇందుకు నామానే కారణమని అప్పట్లోనే తుమ్మల వర్గం ఆగ్రహించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తుమ్మలను ఓడించేందకు నామా వర్గీయులు పనిచేశారని, అందుకే టీడీపీ బలంగా ఉన్నా తుమ్మల ఓటమి పాలయ్యారని ఆయన అనుచరులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దీంతో పార్టీని వీడటంపై తుమ్మల మల్లగుల్లాలు పడ్డారు. పార్టీ కేడర్ కూడా ఆయనపై ఒత్తిడి తెచ్చింది.

అయితే, పార్టీ మారే విషయంలో చాలా గుంభనంగా వ్యవహరించిన తుమ్మల కార్యకర్తల ఒత్తిడికి మొదట్లో తలొగ్గినట్టు కనిపించలేదు. కానీ, టీఆర్‌ఎస్ కూడా ఆయన పట్ల సుముఖంగానే ఉండడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ తర్వాత ఆయన హామీ మేరకు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో తుమ్మల అనుచరులు వారం రోజులుగా హల్‌చల్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఆయన పేరుతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలంటూ ‘తుమ్మల.. రా.. కదలిరా’.. ‘మీ వెంటే మేమంతా’ అని రాశారు. మరోవైపు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తుమ్మల నిర్ణయమే తనకు శిరోధార్యమని, ఆయన వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, 10 మంది జడ్పీటీసీలు, పెద్ద ఎత్తున సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇతర నాయకులు తుమ్మలతో వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయన వర్గానికే చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రం తాను టీడీపీలోనే ఉంటానని చెప్పడం గమనార్హం.
 
 మంత్రివర్గంలోకి తుమ్మల?
 
 టీడీపీ నేత తుమ్మల నాగేశ్వర్‌రావును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి రంగం సిద్ధమైంది! టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కేబినెట్‌లో కేసీఆర్, తుమ్మల సహచరులు.ఇదే సాన్నిహిత్యంతో వీరిరువురు ఇటీవల సమావేశం కూడా అయ్యారు. మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా తుమ్మలకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. టీఆర్‌ఎస్ నుంచి ఖమ్మం జిల్లాలో ఒక్కరే(జలగం వెంకట్రావు) ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఇప్పటికే ఎక్కువ ప్రాతినిధ్యం దక్కిందన్న కారణంతో జలగం వెంకట్రావుకు అవకాశమివ్వలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి తుమ్మలను మంత్రివర్గంలోకి తీసుకుని, ఆ జిల్లాతో పాటు హైదరాబాద్‌లోనూ టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసుకోవాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు. అయితే ప్రజాక్షేత్రంలో గెలిచిన తనను పక్కనబెట్టి, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తుమ్మలను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే సమాచారం అందుకున్న జలగం వెంకట్రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ఏ మాత్రం బలం లేని ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన తనను గుర్తించకపోవడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు వచ్చే నెల తొలి వారంలోనే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు తుమ్మల సిద్ధమవుతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement