
వరంగల్‌లో వెటర్నరీ కాలేజీకి సీఎం కేసీఆర్ ఓకే
వరంగల్‌లో వెటర్నరీ కళాశాలను ఏర్పాటు చేయాలని పశుసంవర్థకశాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు.
హైదరాబాద్: వరంగల్‌లో వెటర్నరీ కళాశాలను ఏర్పాటు చేయాలని పశుసంవర్థకశాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. కాలేజీ ఏర్పాటుకు ముందు వెటర్నరీ కాలేజీ ఆఫ్ ఇండియా (వీసీఐ) అనుమతి అవసరం. అందుకోసం వీసీఐకి లేఖ రాసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా గురువారం ‘సాక్షి’కి చెప్పారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే ఈ కాలేజీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో దాదాపు 30 వెటర్నరీ సీట్లు వరంగల్‌కు వచ్చే అవకాశం ఉంది. సీట్ల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలావుండగా ఫిషరీస్ సైన్స్ కాలేజీ ఏర్పాటుపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ కాలేజీని మహబూబ్‌నగర్ జిల్లా జూరాల సమీపంలో ఏర్పాటు చేయాలా? లేకుంటే ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేయాలా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఫిషరీస్ సైన్స్ కాలేజీపై ఆయా జిల్లాల మంత్రులు తమకంటే తమకంటూ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాకు ఇప్పటికే మెడికల్ కాలేజీ మంజూరు చేసినందున ఖమ్మం జిల్లాకే వెటర్నరీ కాలేజీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సీఎం తీసుకునే నిర్ణయంపైనే ఏ జిల్లాకనేది స్పష్టత వస్తుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కేజ్ కల్చర్‌పై సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించడంతో ఫిషరీస్ సైన్స్ కాలేజీకి ప్రాధాన్యం ఏర్పడింది.