
సాక్షి, యాదాద్రి: కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా ఉండగా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లు ఆయన చెబుతున్నారని, అయితే అవి ఎక్కడ జరిగాయో ప్రజలకు చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన భువనగిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి పీవీ శ్యామ్‌సుందర్‌రావును గెలిపించాలని కోరుతూ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పాకిస్తాన్ సైనికులు మన సైనికులను కాల్చి చంపుతుంటే ఏమీ చేయలేక చేతులెత్తేశారని ఆరోపించారు.
మోదీ.. ప్రధానిగా దేశంపై ఎవరైనా కన్నువేస్తే వారి కళ్లు పీకేస్తామన్న విధంగా పోరాడుతున్నారని, దేశాన్ని కాపాడాలంటే మోదీని గెలిపించాలని అన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.1.30 లక్షల కోట్ల నిధులిస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. మోదీని మళ్లీ ప్రధానిగా చేయడానికి భువనగిరిలో బీజేపీ అభ్యర్థి శ్యామ్‌సుందర్‌రావును గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థితోపాటు పార్టీ నేత వెదిరె శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment