
2నే సీఎంగా కేసీఆర్ ప్రమాణం
వేదిక రాజ్‌భవన్, ఉదయం 8.55కు ముహూర్తం?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో టీఆర్‌ఎస్ అధినేత, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కె.చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యా రు. రాష్ట్ర విభజనపై అధికారులతో సమావేశమైన తర్వాత ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. పంపకాలకు చేసిన ఏర్పాట్లపై తన అభ్యంతరాలతో పాటు తన మంత్రివర్గ ప్రమాణస్వీకారంపై కూడా ఆయనతో చర్చించారు. జూన్ 2న ప్రమాణస్వీకారం చేయాలనే నిర్ణయాన్ని కేసీఆర్ ఇప్పటికే గవర్నర్‌కు తెలియజేశారు. అయితే ముహూర్తం మా త్రం ఇంకా ఇదమిత్థంగా నిర్ణయం కాలేదు. ఉదయం 8.55కు, మధ్యాహ్నం 12.57కు మంచి ము హూర్తాలున్నట్టు సన్నిహితులు కేసీఆర్‌కు చెబుతున్నారు. దేన్ని ఎంచుకుంటారో ఇంకా ఖరారు కాకపోయినా 8.55కే ప్రమాణం చేయవచ్చని చెబుతున్నారు. ముహూర్తాలు, వాస్తు, సంఖ్యా శాస్త్రం తదితరాలను కేసీఆర్ బాగా నమ్ముతారన్నది తెలిసిందే. అందుకే ఈ విషయంలో ఆయన కచ్చితంగా ఉండే అవకాశముంది.
రాజ్‌భవన్‌లోనే..
తెలంగాణలో తొలి ప్రభుత్వం గనుక ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎల్బీ స్టేడియం, నిజాం కాలేజీ మైదానం, పెరేడ్ మైదానం వంటివాటిలో భారీ జనసందోహం మధ్య కార్యక్రమం జరగాలని వాదిస్తున్నారు. కేసీఆర్ మాత్రం అందుకు విముఖంగా ఉన్నారు. తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవాన్ని ఎక్కడికక్కడ నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే అంతర్గతంగా సమాచారమిచ్చినందున హైదరాబాద్‌లో భారీ జన సమీకరణ చేస్తే గ్రామాల్లో ఆవి ర్భావ దినోత్సవం సజావుగా జరగకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లోనే సాదాసీదాగా, నిరాడంబరంగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్థూలంగా నిర్ణయించుకున్నారు.
15 మందితోనే ప్రమాణస్వీకారం?
శాసనసభ పరిమాణంలో మంత్రివర్గం సంఖ్య 15 శాతం మించరాదన్న నిబంధన ప్రకారం తెలంగాణలో మంత్రులుగా గరిష్టంగా 18 మందికే అవకాశముంది. ముందుగా తనతో పాటు 15 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేలా కేసీఆర్ ఏర్పాట్లు చేసుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ అదృష్ట సంఖ్య 6 గనుక 15(1+5) మందికే మొగ్గుతారని వారంటున్నారు.
శాఖలన్నీ కేసీఆర్ మదిలోనే...
మంత్రివర్గంలో ఎవరుంటారు, ఎవరికి ఏ శాఖలన్న వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు. జిల్లాలవారీగా మంత్రివర్గంలో ఎవరుండాలనే దానిపై పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో కేసీఆర్ ఇప్పటికే చర్చించి ఒక అవగాహనకు వచ్చారు. అయితే శాఖలపై మాత్రం కేసీఆర్ తన మనోగతాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో ఐదారుగురికి మినహా మిగతా వారికి మంత్రులుగా చేసిన అనుభవం లేదు. అందుకనే ఏ రంగాలపై ఎవరికి అవగాహన ఉందనే దాన్ని బట్టి శాఖల కేటాయింపు ఉంటుందని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, కె.స్వామి గౌడ్‌లకు మంత్రివర్గంలో చోటు ఉంటుందని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. రెండు సభల్లోనూ సభ్యత్వం లేని సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి, మాజీ ఐఏఎస్ కె.వి.రమణాచారికి కూడా మంత్రివర్గంలో చోటు ఉండొచ్చని కేసీఆర్ సన్నిహితులు అంటున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారికి అవకాశం లేదని ప్రకటన చేసే ఆస్కారముంది. అంతా కొత్తవాళ్లే గెలిచిన నల్లగొండకు మాత్రమే మినహాయింపు ఇస్తారంటున్నారు.
లోక్‌సభకు ఎల్లుండి రాజీనామా?
మెదక్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సోమవారం రాజీనామా చేయనున్నారు. మెదక్ నుంచి లోక్‌సభకే గాక గజ్వేల్ నుండి ఆయన శాసనసభకు కూడా ఎన్నికవడం తెలిసిందే. ఇలా రెండు చోట్ల గెలిచిన వారు అధికారిక గెజిట్ జారీ అయిన నాటి నుంచి 14 రోజుల్లోగా ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల విజేతల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18 న రాష్ట్రపతికి అందజేసింది. 19న గెజిట్ విడుదలైంది. కేసీఆర్ టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికవడం, జూన్ 2న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. అందుకే మెదక్ లోక్‌సభ సభ్యత్వాన్ని ఆయన వదులుకుంటున్నారు. ప్రధానిగానరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. ఆ సందర్భంగానే సోమవారం రాజీనామా లేఖ సమర్పిస్తారని ఆయన సన్నిహితులు చెప్పారు. అప్పటికి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశాలు లేనందున రాజీనామా లేఖను నేరుగా రాష్ట్రపతికి ఇచ్చే అవకాశాలున్నాయన్నారు. కేసీఆర్ రాజీనామా జూన్ 2 లోపల ఆమోదం పొందాల్సి ఉంటుంది.