
టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి
- ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చేరిక
- అదేదారిలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్సీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాకు చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు కె.జనార్దన్‌రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతకుముందు ఆయన ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీలో చేరనప్పటికీ.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్.. తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు పావులు కదుపుతోంది.
ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు గాలం వేస్తోంది. చట్టసభల్లో అతి పెద్ద పార్టీగా అవతరించేందుకు చర్యలను వేగిరం చేసింది. ఇందులో భాగంగానే బుధవారం ప్రత్యర్థి పార్టీలకు చెందిన తొమ్మిది మంది శాసనమండలి సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలిపేసుకుంది. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు జనార్దన్‌రెడ్డి టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.
ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న ఆయన ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడం.. కొత్త రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం.. స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడిగా ఉన్న ఆయన సోదరుడు పి.నరేందర్‌రెడ్డి కూడా అదే పార్టీలో చేరడం తెలిసిందే. జిల్లాలో టీఆర్‌ఎస్‌లో చేరిన తొలి ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి కాగా జనార్దన్‌రెడ్డి రెండో వారు. ఇదిలా ఉండగా.. జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీపైనా ఆ పార్టీ వలవేసినట్లు తెలిసింది. అయితే ఆ పార్టీ చేపట్టిన ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.