బడ్జెట్ తర్వాత భారీ మార్పులు
* సన్నిహితుల వద్ద కేసీఆర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాబోయే బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రివర్గంలో భారీ స్థాయిలో మార్పులు, చేర్పులు జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్లు, ఇతర పదవుల్లో ఆశించిన ప్రాధాన్యత దక్కనివారికి, ఇంకా పదవులను ఆశిస్తున్నవారికి కేసీఆర్ ఇదే విషయాన్ని చెబుతున్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గంలోకి కొత్తగా ఆరుగురు చేరనున్న నేపథ్యంలో... సామాజికవర్గాలు, జిల్లాలు, రాజకీయ ప్రయోజనాలపై టీఆర్‌ఎస్‌లోనూ, రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేబినెట్‌లోకి కచ్చితంగా వస్తామని, ప్రధాన పోర్టుఫోలియో దక్కుతుందన్న ధీమాతో ఉన్న పలువురు... తమకు ఇతర పదవులతో సరిపెట్టడం, మరికొందరు అనూహ్యంగా తెరపైకి రావడంతో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అలాంటి వారికి పార్లమెంటరీ కార్యదర్శి పదవులు, కార్పొరేషన్లు కట్టబెడుతున్నారు. రాబోయే కాలంలో మంచి అవకాశాలుంటాయంటూ సర్దిచెబుతున్నారు.
కొప్పుల ఈశ్వర్‌కు చీఫ్ విప్ పదవిని ఇవ్వడంతో పాటు వచ్చే బడ్జెట్ సమావేశాలదాకా ఓపిక పట్టాలని సీఎం కేసీఆర్ బుజ్జగించారు. ఆశావహులను సీనియర్ మంత్రులు ఈటెల రాజేందర్, టి.హరీశ్‌రావు బుజ్జగిస్తున్నారు. ‘‘వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గంలో మార్పులుంటాయి. పనితీరు, ఆరోపణలు, సమస్యలు, సామాజిక సమీకరణలపై ఆధారపడి మార్పులుంటాయి. ఒకట్రెండు బడ్జెట్ సమావేశాలదాకా చూసి, పనితీరుపై సమీక్షించాలన్న అభిప్రాయం మేరకు కొందరిని భరిస్తున్నాం. వారిని వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత తప్పించే అవకాశాలున్నాయి’’ అని చెబుతున్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గంలో సామాజిక కూర్పు
వెలమ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (మెదక్), తారక రామారావు (కరీంనగర్), హరీశ్‌రావు (మెదక్)
మైనారిటీ: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ (హైదరాబాద్)
మాదిగ: డిప్యూటీ సీఎం టి.రాజయ్య (వరంగల్)
రెడ్డి: నాయిని నర్సింహారెడ్డి (హైదరాబాద్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (నిజామాబాద్), పట్నం మహేందర్‌రెడ్డి (రం గారెడ్డి), జి.జగదీశ్‌రెడ్డి (నల్లగొండ)
బీసీ: ఈటెల రాజేందర్ (కరీంనగర్), జోగు రామన్న (ఆదిలాబాద్), టి.పద్మారావుగౌడ్ (హైదరాబాద్)