
ఢిల్లీకి కేసీఆర్
ప్రధాని, కేంద్ర మంత్రులతో , భేటీ అయ్యే అవకాశం
రాష్ర్ట సమస్యలను ప్రస్తావించనున్న సీఎం
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తుతోనూ సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, ఇతర సమస్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మూడు రోజుల పర్యటన కోసం గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌తో సమావేశం కావాలని ఆయన భావిస్తున్నారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే నియమితులైన జస్టిస్ హెచ్‌ఎల్ దత్తును కూడా ముఖ్యమంత్రి కలువనున్నారు. ఈ పర్యటనలోభాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి కేసీఆర్ తీసుకురానున్నారు.
నెల కిందట ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్రానికి చేసిన పలు విజ్ఞప్తుల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరని నేపథ్యంలో ఆయన మరోసారి కేంద్ర మంత్రులను కలసి ఆయా అంశాలను గుర్తు చేయనున్నారు. వాస్తవానికి టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల తర్వాత 13న ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి మొదట నిర్ణయించారు. అయితే ‘హుదూద్’ తుపాను కారణంగా ప్లీనరీ వాయిదా పడటంతో ఢిల్లీ పర్యటనను ఖరారు చేశారు. కాగా, ఢిల్లీలోనే ముఖ్యమంత్రి కంటి పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు ఆయన భార్య, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు వెళ్లారు.