ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో చర్చలు మరో రెండ్రోజులు వాయిదా పడ్డాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైనా సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే రెండ్రోజులు ఆలస్యమైనా మరింత కసరత్తు చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారు. ఈ నెల 16న తాను స్వయంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు.
రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం తమ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. మంత్రులు ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి ఈ నివేదికను అందజేశారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా మరింత పక్కాగా నివేదికను అందించాలని, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరపాలని సీఎం మంత్రులను ఆదేశించారు.
ఈటల సారథ్యంలోని సబ్ కమిటీలో ప్రస్తుతం కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో చర్చల దృష్ట్యా మంత్రివర్గ ఉపసంఘంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని కూడా చేర్చుతూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ నాయకులతో ఈ నెల 16న మధ్యాహ్నం సమావేశమై, అదేరోజు ప్రభుత్వం తరఫున నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సీఎం వెల్లడించారు.
గతంలో కంటే వేగంగా పీఆర్సీ
ఉద్యోగుల వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదిక ఇవ్వడానికి చాలా సమయం తీసుకుంటోందని, గతంలో ఉన్న ఈ మూస పద్ధతికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. త్వరితగతిన ఈ పని పూర్తి చేసేందుకు అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా పీఆర్సీపై సీఎం కీలక ప్రకటన చేయటం ఖాయమని తెలుస్తోంది.
స్పష్టమైన సిఫారసులు లేకుండానే..
ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చలు జరిపిన మంత్రివర్గ ఉపసంఘం మొత్తం 52 అంశాలపై తమ నివేదికను సీఎంకు సమర్పించింది. ఉద్యోగులకు సంబంధించిన 18 అంశాలు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన 34 డిమాండ్లను ఇందులో ప్రస్తావించింది. తక్షణమే పరిష్కరించే సమస్యలు, వివిధ అడ్డంకులున్న సమస్యలు, ఇప్పటికిప్పుడు పరిష్కరించలేని సమస్యలుగా.. వీటిని వర్గీకరించినట్లు సమాచారం.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తోపాటు పీఆర్సీ ఏర్పాటు, ఈలోగా మధ్యంతర భృతి(ఐఆర్) చెల్లింపు, గతేడాది జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల చెల్లింపు, కొత్త జిల్లాలప్పుడు ఇచ్చిన ఆర్డర్ టు సర్వ్ రద్దు చేసి శాశ్వత కేటాయింపులు, ఉద్యోగుల బదిలీలు, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రప్పించే అంశాలకు మంత్రివర్గ ఉపసంఘం తమ నివేదికలో అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఉద్యోగుల డిమాండ్లను యథాతథంగా నివేదికలో పొందుపరిచిన సబ్ కమిటీ.. స్పష్టమైన సిఫారసు చేయకుండానే తుది నిర్ణయాన్ని సీఎంకే వదిలేసింది. రిటైర్‌మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనను నివేదికలో మాటమాత్రమే ప్రస్తావించినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోందని సూచించింది.
నేడు, రేపు భేటీలు
మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం కొన్ని అంశాలపై మంత్రులను ప్రశ్నించారు. అయితే వారు సరైన సమాధానాలివ్వకపోవటంతో మరోమారు సమావేశమై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 12, 13వ తేదీల్లో అధికారులతో సమావేశాలు జరపాలని సబ్ కమిటీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment