కేడీ నం.1 | kedi no 1 | Sakshi
Sakshi News home page

కేడీ నం.1

Published Sun, May 18 2014 3:14 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

kedi no 1

ఐఏఎస్ అధికారి అంటే పెద్ద ఉద్యోగం... ఎవరితోనైనా పనులు చిటికెలో చేయించుకోవచ్చనుకున్నాడో ఏమో చిన్న వయసులోనే ఓ యువకుడు అతిపెద్ద మోసానికి పాల్పడ్డాడు. ట్రెయినీ ఐఏఎస్ అధికారినని, తమిళనాడులో విధులు అప్పగించారని చెప్పుకుంటూ నకిలీ పత్రాలు సృష్టించుకుని పోలీసులనే బురిడీ కొట్టించి చివరకు కటకటాలపాలయ్యాడు. మోసం చేయడమే వృత్తిగా స్వీకరించి రాజభోగాలు అనుభవించిన ఆ వ్యక్తి పేరు యాంసాని రాజేశ్.
 
 గోదావరిఖని, న్యూస్‌లైన్  : రాజేశ్‌ది గోదావరిఖని మారుతీనగర్‌లో నివాసం. పేద కుటుంబం కావడంతో 8వ తరగతి చదువుతున్న సమయంలోనే మెడికల్ షాప్‌లో పనిచేశాడు. డిగ్రీ వరకు గోదావరిఖనిలో చదివి.. తర్వాత సీఏ చేసేందుకు విజయవాడ వెళ్లాడు. సీఏ కోర్సులో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టికల్‌షిప్ చేస్తూ ఓ ఇనిస్టిట్యూట్‌లో ఐఏఎస్ శిక్షణ తీసుకున్నాడు. 2012లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌ఈ) ప్రిలిమ్స్ పరీక్ష రాశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచి రాజేశ్  మోసపు పనులు చేసేందుకు మెదడుకు పనిపెట్టాడు. ఐఏఎస్ అంటే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, అనుకున్న పనులు చకాచకా జరిగిపోతాయని భావించాడు.
 
 2012లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో తనకు ఆల్ ఇండియా స్థాయిలో 45వ ర్యాంకు వచ్చిందని, ఐఏఎస్‌గా ఎంపికయ్యాయని, డెహ్రడూన్‌లో శిక్షణ పొందుతున్నానని గోదావరిఖనిలో సన్నిహితులకు చెప్పాడు. తన భాష, వేషం పూర్తిగా మార్చివేశాడు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు, ఢిల్లీకి పలుమార్లు వెళ్లి వచ్చేవాడు. ఢిల్లీ అడ్రస్‌తో ఓ సిమ్‌కార్డు కూడా తీసుకుని... ఐఏఎస్ శిక్షణలో తనకు ఇచ్చారని నమ్మించాడు. తమిళనాడు ప్రభుత్వం క్యాడర్‌లో తొమ్మిదిమంది ట్రెయినీ ఐఏఎస్‌లకు విధులు అప్పగించగా... అందులో తానొక్కడినంటూ నకిలీపత్రాలు సృష్టించాడు.
 
 నమ్మి.. సన్మానాలు.. సాయం
 రాజేశ్ పోలీసులను సైతం బురిడీ కొట్టించాడు. రాజేశ్ తండ్రి కృష్ణమూర్తి పెద్దపల్లిలోని ఓ పాఠశాల హాస్టల్‌లో వంటలు వండేవాడు. అతి పేదరికంలో నుంచి వచ్చిన రాజేశ్‌కు ఉన్నత చదువుల కోసం ఓ ఏఎస్సై రూ.50 వేల వరకు ఆర్థికసాయం అందించాడు. తాను ట్రెయినీ ఐఏఎస్ అని చెప్పుకోవడంతో నమ్మిన పోలీసులు రామగుండంలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు వాహనాన్ని సమకూర్చారు. పలు సంస్థలు సన్మానించి, ఆర్థిక ంగా సాయమందించాయి. వీఆర్వో ఉద్యోగం ఇప్పిస్తానని కొలిపాక సురేశ్ వద్ద రూ.10 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఈ విధానం బాగుందని భావించిన రాజేశ్ దానినే కొనసాగించాడు.
 తీగలాగితే..
 రాజేశ్ వ్యవహారశైలిపై డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డికి అనుమానం వచ్చింది. దీంతో ప్రొబేషనరీ డీఎస్పీ చక్రవర్తి ద్వారా పూర్తిస్థాయిలో విచారణ జరిపించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులకు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో శిక్షణ ఇస్తుండగా... రాజేశ్ డెహ్రడూన్ అని చెప్పడంతో అనుమానం బలపడగా.. తీగలాగితే డొంకంతా కదిలింది.
 
 2012లో యూపీఎస్‌ఈ ప్రిలిమినరీ పరీక్షలో రాజేశ్ క్వాలిఫై కాలేదని నిర్ధారణ చేసుకున్నారు. ఢిల్లీలో ఉన్న రాజేశ్‌ను గోదావరిఖనికి పిలిపించి శనివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రాజేశ్ అరెస్ట్ చూపించి తర్వాత వన్‌టౌన్ సీఐ శ్రీధర్‌తో కలిసి డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ఐఏఎస్‌గా ఎంపికయ్యానని నకిలీపత్రాలు సృష్టించి ప్రజలను మోసగించినందుకు రాజేశ్‌పై 420, 468 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రాజేశ్ బ్యాంకు ఖాతాలో రూ.4 లక్షలు ఉన్నాయని, అవి ఎక్కడి నుంచి వచ్చాయనే విషయమై ఆరా తీస్తామని చెప్పారు.
 
 మోసం చేశా: రాజేశ్
 సమాజంలో ఉన్నతంగా జీవించవచ్చని భావించి ఐఏఎస్‌గా ఎంపికయ్యానని నకిలీపత్రాలతో మోసం చేశా. మోసం చేస్తున్నానని అనుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించా. అరుుతే తల్లిదండ్రులను చూసి దానిని విరమించుకున్నా. ఐఏఎస్‌గా వచ్చిన ఆదరణను చూసి దానినే కొనసాగించా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement