కర్రపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతల తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులకు శుక్రవారం కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ లైబ్రరీ ప్రాంగణంలో మహాగణపతిని ప్రతి ఏటా మాదిరిగానే 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు ‘సప్తముఖ వినాయకుడిగా’ భక్తులకు దర్శనమిస్తారని శిల్పిరాజేంద్రన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు ఎన్నడూ తయారుచేయని విధంగా విఠల శర్మ సిద్ధాంతి సూచనల మేరకు సప్తముఖ వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతిని రూపుదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. మహాగణపతిని ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా వివిధ రంగులలో వినాయకుడి తలలు, ఆపై ఏడు తలల సర్పం, 14 చేతుల్లో వివిధ రకాల ఆయుధాలతో మహాగణపతి డిజైన్‌ను తయారుచేస్తున్నామన్నారు.
మరో వారం పది రోజుల్లో ఈ డిజైన్ ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ప్రతీ సంవత్సరం సర్వేశాం ఏకాదశి సందర్భంగా నిర్వహించే కర్రపూజా కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధానకార్యదర్శి భగవంతరావు, శిల్పి రాజేంద్రన్‌తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఖైరతాబాద్ మంటపంలో వినాయక విగ్రహానికి పూజలు చేసి అనంతరం కర్రను పాతారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు గజ్జల నాగేష్, ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్, రాజ్‌కుమార్ నాయకులు మహేష్‌యాదవ్, మహేందర్‌బాబు, మధుకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి సంఘం తరపున మహాగణపతికి భారీ కండువా....
మహాగణపతికి ప్రతీ సంవత్సరం లాగానే పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం తరపున 75 అడుగుల భారీ గాయత్రి జంధ్యం, 75 అడుగుల భారీ చేనేత కండువా వినాయక చవితి రోజు సమర్పించనున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షులు కొండయ్య, వ్యవస్థాపక అధ్యక్షులు కడారి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఏలే స్వామి శుక్రవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment