
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజలకు అందుబాటులో ఉన్న కలెక్టరేట్‌ను నగరానికి దూరంగా తరలించి ప్రజాధనాన్ని స్వాహా చేయాలని ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు కుట్రపన్నుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయాన్ని తరలించడం వల్ల ప్రజ లు ఇబ్బందులు పడతారని, ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు ఆందోళనలు చేపట్టాయని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రజల అభిప్రాయం మేరకు, మంత్రితో మా ట్లాడి ఎన్‌ఎస్‌పీలోనే కలెక్టరేట్ నిర్మాణం జరిగేలా చూస్తానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని పేర్కొన్నారు. వెంకటాయపాలెం రైతులు రూ.కోటికి భూమి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, అక్కడే కలెక్టరేట్ నిర్మించనున్నట్లు ప్రకటనలు వస్తున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యే అవగాహన లేకుండా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతంలోని మార్కెట్, వన్‌టౌన్ ప్రాంతంలోని బస్టాండ్, కలెక్టరేట్ లాంటి ప్రభుత్వ కార్యాలయాలను తరలించి నగరాభివృద్ధి జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉన్న కలెక్టరేట్‌ను తరలిస్తే సహించేది లేదని, అన్ని పార్టీలను కలుపుకొని కలెక్టరేట్ తరలింపును అడ్డుకునేందుకు ఆందోళనలు చేపడతామని హెచ్‌చరించారు. కలెక్టరేట్ తరలింపుపై రెండు రోజుల్లో భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో జిల్లా నాయకులు కొత్తపల్లి సీతారాములు, వడ్డెబోయిన నర్సింహారావు, తిలక్, తాజు ద్దీన్, ఫజల్, మల్లేశ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.