యూనిఫాం క్లాత్
సాక్షి, నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థుల మధ్య తారతమ్యం ఉండొద్దని.. అందరూ సమానమనే భావన కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం.. యూని ఫాంలను ప్రవేశపెట్టి.. అమలు చేస్తోంది. ఇప్పటివరకు ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే అందించే యూనిఫాం.. ఇకనుంచి 9,10వ తరగతి విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 20వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి విద్యార్థికి రెండు జతల చొప్పున అందించే డ్రెస్‌లకు సంబంధించిన క్లాత్ పాఠశాలలకు చేరగా.. ఇందుకయ్యే కుట్టు కూలిని ప్రభుత్వం విడుదల చేసింది.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాం అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 9,10వ తరగతి విద్యార్థులకు కూడా అందించేందుకు నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి మేలు జరగనుంది. 255 ప్రభుత్వ పాఠశాలల్లో 9,10వ తరగతి విద్యార్థులు 20వేల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. వీరికి ప్రతి ఏటా రెండు జతల చొప్పున దుస్తులు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే యూనిఫాంలకు సంబంధించిన క్లాత్ చేరింది. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ తీర్మానం అనంతరం దుస్తులు కుట్టిచ్చి విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టారు.
ఖర్చు ప్రభుత్వానిదే..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అన్ని తరగతుల విద్యార్థులకు స్కూల్ యూనిఫాం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లకు సిద్ధమైంది. పాఠశాలల్లో 9,10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరించగా.. ఆ మేరకు సరిపోయేంత వస్త్రం పాఠశాలలకు చేరింది. దుస్తులు కుట్టించే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ఒక్కో జతకు రూ.50 చొప్పున దర్జీకి చెల్లించనున్నారు.
రెండు జతలు అందిస్తాం..
జిల్లాలో 9,10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులు త్వరలోనే అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే అన్ని పాఠశాలలకు క్లాత్ పంపించాం. సాధ్యమైనంత త్వరగా కుట్టించి విద్యార్థులకు రెండు జతల చొప్పున అందించేలా చర్యలు చేపట్టాం. జిల్లావ్యాప్తంగా దాదాపు 20వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. – మదన్‌మోహన్, డీఈఓ
నిర్ణయం మంచిదే..
9,10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా మంచిదే. తల్లిదండ్రులకు కొంత మేర ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రభుత్వమే రెండు జతల యూనిఫాం అందించడం మంచి నిర్ణయం. దుస్తులు అందించేందుకు త్వరగా చర్యలు చేపట్టాలి. – కీర్తి, పదో తరగతి విద్యార్థిని, నేలకొండపల్లి
అందరికీ యూనిఫాం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గతంలో 8వ తరగతి వరకే యూనిఫాంలు వచ్చేవి. ప్రస్తుతం 9,10వ తరగతి విద్యార్థులకు ఇవ్వడం సంతోషకరం. మా పాఠశాలలో మొత్తం 96 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. ఎస్‌ఎంసీ తీర్మానంతో దర్జీకి క్లాత్ అందించాం. – వి.లక్ష్మి, నేలకొండపల్లి హైస్కూల్ హెచ్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment