
హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని..
హైదరాబాద్: సినిమాల్లో అవకాశం ఇస్తానని ఒక వ్యక్తి తనను మోసం చేశాడంటూ కృష్ణవేణి అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని ఆమె కోరింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని చెప్పి శ్రీనివాస్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఖమ్మం జిల్లా రామాపురంకు చెందిన కృష్ణవేణి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కొన్ని నెలల క్రితం విక్కీ అనే వ్యక్తి ద్వారా శ్రీనివాస్ పరిచయమయ్యాడని ఓ టీవీ చానల్‌తో చెప్పింది. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని అతడు చెప్పాడని వెల్లడించింది. సినిమా పరిశ్రమలో తనకు పెద్దవాళ్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పడంతో అతడిని నమ్మి డబ్బు ఇచ్చినట్టు చెప్పింది. సినిమాల్లో అవకాశం అడిగితే ‘కమిట్‌మెంట్’ అడిగాడని తెలిపింది. కమిట్‌మెంట్ అంటే ఏంటని అడిగితే.. తనతో ఏకాంతంగా గడిపితే గడిపితే హీరోయిన్ చేస్తానని చెప్పాడని వెల్లడించింది. అందుకు తాను ఒప్పుకోకపోలేదని, తన డబ్బు తిరిగివ్వాలని కోరితే తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపించింది.
కాగా, కృష్ణవేణి ఆరోపణలను శ్రీనివాస్ తోసిపుచ్చాడు. ఆమె ఎవరో తనకు తెలియదని, హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పలేదని అన్నాడు. తాను చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటానని తెలిపాడు.